Andhra News: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత.. వైకాపా ఎమ్మెల్యేపై దాడి!

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తపల్లిలో ఈ ఉదయం వైకాపా నాయకుడు గంజి

Updated : 30 Apr 2022 16:24 IST

ఏలూరు: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపాలో వర్గపోరు బహిర్గతమైంది. ఇక్కడ ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జి.కొత్తపల్లిలో ఇవాళ వైకాపా నాయకుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీలోని మరో వర్గం అడ్డుకొని దాడికి దిగింది. ఎమ్మెల్యేను వెంబడించి ఓ ప్రాంతంలో వైకాపా వర్గీయులు చుట్టుముట్టి దాడి చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి ఆయనను పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంలో గంజిప్రసాద్‌ హత్య జరిగినట్లు సమాచారం. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. వైకాపాలోని మరో వర్గం రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. తోపులాటలో వైకాపా కార్యకర్తకు గాయాలవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో నిందితులు..

మరోవైపు గంజి ప్రసాద్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా కార్యకర్తలు మండవల్లి సురేశ్‌, మోహన్‌కుమార్‌, హేమంత్‌ కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. గంజి ప్రసాద్‌ను జి.కొత్తపల్లి వైకాపా ఎంపీటీసీ బజారయ్య హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎంపీటీసీ బజారయ్య పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొంతకాలంగా బజారయ్య, గంజి ప్రసాద్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని