కరోనా టీకాతో ‘ఆ’ సమస్య? నిజానిజాలివే..!

టీకాలు తీసుకోవడం వల్ల నపుంసకత్వం.. వట్టి పుకార్లంటూ డీసీజీఐ స్పష్టం చేసింది.

Updated : 04 Jan 2021 04:22 IST

దిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’, సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ‘కొవిషీల్డ్‌’ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి మనదేశంలో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకాలు తీసుకోవడం వల్ల నపుంసకత్వం తలెత్తుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇవన్నీ వట్టి పుకార్లంటూ డీసీజీఐ స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ పనితీరుకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘కొవిడ్‌ టీకాల్లో హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. ప్రజలను చంపి జనాభాను తగ్గించేందుకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారని భవిష్యత్తులో తెలియవచ్చు. దీనివల్ల ప్రజలు నపుంసకులు కావచ్చు. లేదా ఏమైనా జరగచ్చు’’ అని ఈ సమాజ్‌వాదీ పార్టీ అధినేత చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. కాగా, ‘‘టీకాల భద్రత విషయంలో ఇసుమంతైనా రాజీ పడేది లేదు. మేము అనుమతులిచ్చిన వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితం. అన్ని టీకాల మాదిరిగానే తేలికపాటి జ్వరం, టీకా ప్రదేశంలో నొప్పి, అలర్జీ వంటి సాధారణ విపరిణామాలు కొవిడ్‌ టీకా విషయంలోనూ కనిపించవచ్చు. ఐతే కరోనా టీకా వేయించుకోవటం వల్ల నపుంసకత్వం బారిన పడతారనే పుకార్లు అర్థరహితం’’ అని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీ.జీ సోమానీ స్పష్టం చేశారు.

కాగా, టీకాకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే వదంతులను నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వప్రయోజనాలను ఆశించే కొందరు వ్యక్తులు బాధ్యతారహితమైన ప్రవర్తన వల్ల ఈ విధమైన పుకార్లు వ్యాప్తిస్తాయన్నారు.  బాధ్యతాయుత పౌరులుగా ఇటువంటి ప్రచారాలకు దూరంగా ఉండటమే కాకుండా.. అవి సామాజిక మాధ్యమాల్లో వాటిని వ్యాప్తించకుండా నిరోధించాలని ప్రధాని ప్రజలను కోరారు.

ఇవీ చదవండి..

టీకా మానవ ప్రయోగాల్లో 23 వేలమంది..

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు