KCR: అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించాం: కేసీఆర్‌

గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతికాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు.

Updated : 15 Aug 2023 12:34 IST

హైదరాబాద్‌: గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతికాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

‘‘తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందనే పేరు తెచ్చాం. రాష్ట్రంలో నేడు విద్యుత్‌ వెలుగులు కనిపిస్తున్నాయి. పంటకాలువలు.. పచ్చని చేలతో తెలంగాణ కళకళలాడుతోంది. కాళేశ్వరం జీవధారలతో సస్యశ్యామలం అవుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద అవరోధం తొలగిపోయింది. సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తాం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని పైరులతో కళకళలాడుతాయి. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇలాగే అందించాలి.

రెండు దశల్లో రూ.37వేల కోట్ల రుణమాఫీ చేశాం

తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉంది. విద్యుత్‌ రంగంలో రాష్ట్రానికి స్ఫూర్తిదాయక విజయగాథ. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టింది. తక్షణ చర్యలకు రూ.500 కోట్లు విడుదల చేశాం. రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా దేశానికి తెలంగాణ ఆదర్శం. రెండు దశల్లో దాదాపు రూ.37వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతులకు ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయించాం. చేనేత గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు అందిస్తాం.

సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు యత్నించాయి

ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కొందరు ఆందోళన చెందుతున్నారు. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాయి. ఆ శక్తుల ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఆర్టీసీ బిల్లును ఆమోదించాం. బిల్లు ఆమోదంతో ఆ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సృష్టించాం. కొందరు అల్పబుద్ధితో రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన జవాబు చెబుతారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ని అడ్డుకునేందుకు విపక్ష నేతలు యత్నించారు. ఎన్జీటీలో కేసులు వేసి వికృత మనస్తత్వం బయట పెట్టుకున్నారు. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి.

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌ రూ.1000 కోట్లు

త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతాం. అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లిస్తామని స్వయంగా ప్రకటించాను.  సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.వెయ్యికోట్లు పంపిణీ చేస్తాం. వచ్చే 3-4 ఏళ్లలో మెట్రో రైల్‌ విస్తరణ పూర్తిచేయాలని నిర్ణయించాం. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కి.మీ. మెట్రో సౌకర్యం రానుంది. రూ.2.51లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. ఈ 9 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో 17.21లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి’’అని కేసీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని