న్యాయసేవల్లో మహారాష్ట్ర టాప్‌

గడచిన ఏడాది 2020లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తరువాతి స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, పంజాబ్‌, కేరళ ఉన్నాయి. ఈ మేరకు టాటా ట్రస్ట్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Updated : 29 Jan 2021 13:41 IST

వెల్లడించిన నివేదికలు

దిల్లీ: గడచిన ఏడాది 2020లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తరువాతి స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, పంజాబ్‌, కేరళ ఉన్నాయి. ఈ మేరకు టాటా ట్రస్ట్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోటికన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల్లో త్రిపుర మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో సిక్కిం, గోవా ఉన్నాయి. పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, న్యాయసహాయం వంటి వాటి నుంచి తీసుకున్న వివరాల ప్రకారం ఈ నివేదికలు రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా దేశంలో మహిళా న్యాయమూర్తులు 29శాతం మాత్రమే ఉన్నట్లు వారు తెలిపారు. హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల శాతం 11 నుంచి 13శాతానికి పెరగ్గా, కింది కోర్టుల్లో 28 నుంచి 30శాతానికి పెరిగిందన్నారు.

40 మిలియన్ల కేసులు పెండింగ్‌..
ఈ నివేదికకు ముందుమాట రాసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంబి లోకూర్‌ మాట్లాడుతూ.. కరోనా కారణంగా కోర్టుల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది కానీ, ఇప్పటికీ పరిష్కరించని కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. నేషనల్‌ జ్యుడిషియల్‌ డాటా గ్రిడ్‌ ప్రకారం ఇప్పటి వరకూ 35.34 మిలియన్ల కేసులు జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అన్ని హైకోర్టుల్లో మరో 4.74 మిలియన్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొత్తం మీద 40మిలియన్ల కంటే ఎక్కువ కేసులు దేశంలో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికం..
జైళ్లల్లో ఒక ఖైదీకి ఖర్చుపెట్టే సగటు ఖర్చు 45 శాతం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఏడాదికి ఒక ఖైదీకి రూ. 2,00,871 ఖర్చు చేస్తుండగా, మేఘాలయలో అత్యల్పంగా రూ. 11,046 ఖర్చు చేస్తున్నారన్నారు. వివిధ రాష్ట్రాల్లోని బడ్జెట్లు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, పనిభారం, పోలీసులు, న్యాయవ్యవస్థ, జైళ్లు వంటి వాటి ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తామని టాటా ట్రస్ట్‌ వెల్లడించింది.

ఇవీ చదవండి..

కరోనాపై పోరులో సవాళ్లను అధిగమించాం: మోదీ

ఆ చర్య లైంగిక వేధింపుల కిందకు రాదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని