Gangula Kamalakar: దరఖాస్తుదారుడు ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు: మంత్రి గంగుల

బీసీ వృత్తి పనివారికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయంపై మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సాయం కోరుతూ ఇప్పటివరకు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 

Updated : 12 Jun 2023 17:29 IST

హైదరాబాద్‌: బీసీ వృత్తి పనివారికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయంపై మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సాయం కోరుతూ ఇప్పటివరకు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు.

‘‘కులవృత్తులు చేసుకొనే వారి జీవితాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. ముడిసరుకు, పనిముట్ల కొనుగోలు కోసం రూ.లక్ష సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని గంగుల సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదన్న మంత్రి.. 2021 ఏప్రిల్ నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పారు. అవసరమైన వారికి ఆదాయ ధ్రువపత్రాల జారీ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

వసతి గృహాల్లో సీట్లు.. ఇక ఆన్‌లైన్‌లో..

రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఇక నుంచి సీట్లను ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లల్లో ప్రవేశాల కోసం https://bchostels.cgg.gov.in వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. మొత్తం 703 హాస్టళ్లలో సీట్లను పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు పూర్తి చేసి దరఖాస్తు సమర్పిస్తే.. ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు పరిశీలించి ప్రవేశానికి అవకాశం కల్పిస్తాం అని మంత్రి గంగుల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని