Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jan 2022 17:25 IST

1. సంక్షేమ బాట

నేరుగా ప్రజలకు నిధులు అందించడమే ప్రధాన కార్యక్రమంగా అడుగులు వేసింది. ఏపీలోని లబ్ధిదారుల ఖాతాలకే రూ.48,083.92 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర బడ్జెట్‌లో వంద రూపాయలు ఖర్చు ప్రతిపాదిస్తే 20 రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు బదిలీ చేయనుంది. నవరత్నాలకు ప్రాధాన్యమిస్తూ, దాదాపు 22 పథకాల ద్వారా రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల్లోని పేదలకు చేయూత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో గురువారం బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఇది దివాలాకోరు బడ్జెట్‌: చంద్రబాబు

2.  కొవిడ్‌ నివారణ చర్యలను ప్రపంచం చూస్తోంది: జగన్‌

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఒకర్ని ఒకరు ప్రోత్సహించి మద్దతివ్వాలే తప్ప ప్రజల్లో భయాన్ని సృష్టించి, ఆడే గుండెల్ని ఆపేయొద్దని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి సూచించారు. టీకా ఉత్పత్తి నుంచి సరఫరా వరకు కేంద్రం నియంత్రణలో ఉందని, తగినన్ని కేటాయింపుల్లేకనే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేయలేకపోతున్నామని సభలో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడు పది ఫలితాలు

తెలంగాణ పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల తర్వాత వాటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫలితాలనుbse. telangana.gov.in, results.cgg.gov.in   తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* సెమిస్టర్‌ చదువులకు వార్షిక రుసుములా?

4. వాహకులకు ముందుగా టీకా

‘సూపర్‌ స్ప్రెడర్లు’.. తమకు తెలియకుండానే ఏదైనా వ్యాధిని తన ద్వారా ఎక్కువమందికి వ్యాప్తి చేసే వాహకులను ఇలా పిలుస్తారు. తెలంగాణలో ఈ తరహా సుమారు 7-8 కేటగిరీలకు చెందిన సూపర్‌ స్ప్రెడర్లు (వైరస్‌ వాహకులు) సుమారు 15 లక్షలమంది ఉంటారని అంచనా. ‘సూపర్‌ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీనివల్ల వ్యాప్తిని చాలావరకూ అరికట్టవచ్చని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* గర్భిణులకు వైద్యం కోసం టోల్‌ఫ్రీ నంబరు

5. కిటికీలు తెరిస్తే.. వైరస్‌కు తలుపులు మూసినట్లే

నాలుగు గోడల మధ్య కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే బయటి నుంచి తాజా గాలి వచ్చేందుకు వీలుగా ఇళ్లు, కార్యాలయాల్లో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు (పీఎస్‌ఏ) కార్యాలయం సూచించింది. దీనివల్ల గాల్లో వైరల్‌ లోడు తగ్గుతుందని పేర్కొంది. పీఎస్‌ఏ సూచనలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. israel: ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్‌ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న 11 రోజుల హింసకు తెరపడింది. కాల్పుల విరమణను హమాస్‌ వర్గాలు నిర్ధారించాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న హింసలో దాదాపు 200 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కరోనా పుట్టుక లోగుట్టు ఏమిటి?

భూలోకాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ స్పష్టత లేక, కుట్ర సిద్ధాంతాలను వ్యాపింపజేసేవారు ఎక్కువయ్యారు. వుహాన్‌ ల్యాబ్‌లో చైనాయే కరోనా వైరస్‌ను పుట్టించిందంటూ సామాజిక మాధ్యమాల్లో రగడ రేగుతుంటే, శాస్త్రజ్ఞులు అంత త్వరగా నిర్ధారణకు రావడానికి సుముఖంగా లేరు. మొదటి నుంచి కరోనా వైరస్‌ గురించి చైనా గుట్టు పాటించడం ప్రస్తుత వివాదానికి హేతువైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. గృహ రుణానికి.. ధీమా!

గృహరుణం... ఒక వ్యక్తి జీవితంలో ఇదే పెద్ద అప్పు. దీన్ని తీసుకున్న వ్యక్తికి అనుకోనిదేదైనా జరిగితే.. కుటుంబానికి ఆ వ్యక్తిని కోల్పోయిన బాధ ఒక వైపు.. అప్పు చెల్లించలేకపోతే.. ఉంటున్న ఇంటిని వదులుకోవాలా అనే ఆందోళన మరోవైపు.. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇంటి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన బీమా ఏర్పాట్లు  చేసుకోవాల్సిందే. మరి, ఆ పాలసీని  ఎలా తీసుకోవాలి? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. కష్టమే కానీ.. అసాధ్యం కాదు!

‘నువ్వీ పని చేయగలవో లేదో... కావాలంటే ఎవరైనా అబ్బాయి సాయం తీసుకో’ అని తన సీనియర్‌ అన్నప్పుడు లెక్కచేయలేదామె. అప్పట్నుంచి క్లిష్టమైన అసైన్‌మెంట్లు మాత్రమే కోరి ఎంచుకునే వారు వీణాజార్జ్‌. ఆ సీనియర్‌కి మళ్లీ ఇంకెప్పుడూ అలా మాట్లాడే అవకాశమివ్వలేదు. కోరి సవాళ్లపై పోరాడే నైజమే ఇప్పుడామెకు... ఎన్నో అంచనాలున్న కేరళ ఆరోగ్యశాఖ మంత్రి పదవిని వరించేట్టు చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. ఇక మహిళల గులాబి పోరు

టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా గులాబి బంతితో ఆడనుంది. ఆస్ట్రేలియాతో డేనైట్‌ టెస్టులో తలపడనుంది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ఈ గులాబి పోరుకు పెర్త్‌ వేదికగా నిలువనుంది. మహిళల క్రికెట్‌ చరిత్రలో గులాబి బంతి మ్యాచ్‌ జరుగుతుండడం ఇది రెండోసారి మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని