Mulapeta Port: మూలపేట పోర్టు వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. మూలపేట పోర్టుకు వచ్చే వాహనాలను విష్ణుచక్రం గ్రామస్థులు ఆదివారం అడ్డుకుని ధర్నా చేపట్టారు.

Updated : 30 Jul 2023 12:05 IST

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. మూలపేట పోర్టుకు వచ్చే వాహనాలను విష్ణుచక్రం గ్రామస్థులు ఆదివారం అడ్డుకుని ధర్నా చేపట్టారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని ఆందోళనకు దిగారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 19న సీఎం జగన్‌ చేతుల మీదుగా రూ.4 వేలకోట్లతో ఓడరేవు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పూర్తిస్థాయిలో నిర్వాసితుల భూములు, ఇళ్లు, చెట్లు తదితర వాటికి పరిహారం చెల్లించాకే పోర్టు పనులు చేపడతామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పటికి 250 ఎకరాల భూములు.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 545 పీడీఎఫ్‌(ప్రాజెక్ట్‌ డాక్యుమెంటేషన్‌ ఫ్యామిలీ)లకు మాత్రమే పరిహారం చెల్లించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ ఆధీనంలోని ప్రభుత్వ భూములు.. వందల ఎకరాల్లో జీడిచెట్లకు పరిహారం చెల్లించలేదు. దీంతోపాటు కొలతలు తీసిన ఇళ్లకూ పరిహారం అందజేయలేదు. మిగతా పరిహారం అందజేయకుండానే పనులు చేపట్టడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్వాసితుల పేరు చెప్పి వైకాపా కార్యకర్తలకే పనులు: మూలపేట సర్పంచ్‌

స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి లేదని.. కూలీలకు పనులు కల్పించడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు వాహనాలు తిరగడంతో రహదారి ధ్వంసమైందని.. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నిర్వాసితుల పేర్లు చెప్పి వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తన అనుచరులు, వైకాపా కార్యకర్తలకు పనులు అప్పగిస్తున్నారని మూలపేట సర్పంచి జి.బాబూరావు ఆరోపించారు. తమకు ఉపాధి కల్పించేవరకు పోర్టు వాహనాలను విడిచిపెట్టబోమని తేల్చి చెప్పారు. నిర్వాసితుల ఆందోళన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, నిర్వాసితుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సుమారు 3 గంటలుగా అక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని