TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు తితిదే (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Updated : 05 Jan 2024 13:43 IST

తిరుమల: సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు తితిదే (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22న అయోధ్య (Ayodhya)లో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి లక్ష లడ్డూలను పంపనున్నట్లు తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు.

శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను కోరుతున్నట్లు ఈవో చెప్పారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15న తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్‌ మైదానంలో సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ‘శ్రీ గోదా కల్యాణం’ వైభవంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని