ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..

ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్‌ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు.

Updated : 06 May 2024 07:14 IST

నగరంలో ఓ వృద్ధాశ్రమంలో..

న్యూస్‌టుడే, కాకినాడ నగరం: ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్‌ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. అలాంటి వారిలో వృద్ధులూ ఉన్నారు. ప్రతీ మండలానికి ఒక వృద్ధాశ్రమాన్ని పెడతానంటూ ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీకి ఎటువంటి ఆధారంలేని అవ్వా, తాతలు మురిసి పోయారు. ఆయన మాటలు నమ్మి ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్ల పూర్తయినా.. ఆ మాట గుర్తుకు రాలేదని వృద్ధులు వాపోతున్నారు. కొందరు ఇళ్ల వద్దే ఏదొక రకంగా కాలం గడపుతుండగా, ఏ ఆధారమూలేని వారు దాతలు నిర్వహించే ప్రైవేటు వృద్ధాశ్రమాల్లో తల దాచుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

కాకినాడ జిల్లాలో 2.50 లక్షల మంది వరకు అన్ని రకాల సామాజిక పింఛనుదార్లు ఉంటారు. ఇందులో 80వేల మందికి పైగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛనుదార్లు ఉన్నారు. వీరిలో దాదాపు 10వేల మంది వరకు ఎలాంటి ఆసరా లేని అభాగ్యులున్నారు. ఇందులో అసల సంతానంలేని వారు కొందరైతే.. సంతానం ఉండి పిల్లలు చూడని వారు మరికొందరు. వీరులో కొందరు తమ ఇళ్ల వద్ద.. ఇతరుల పంచన, దేవాలయాలు, పాఠశాలల వద్ద తలదాచుకుంటూ కాలం గడుపుతున్నారు. మరి కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వృద్ధాశ్రమాలలో చేరి కాలక్షేపం చేస్తున్నారు. కొన్ని వృద్ధాశ్రమాలు ఉచితంగానే భోజన, వసతి కల్పిస్తుండగా, మరికొందరు వారి పింఛనులో కొంత మొత్తాన్ని తీసుకుని వసతి కల్పిస్తున్నాయి. జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మండలానికో వృద్ధాశ్రమం ఏర్పాటైతే ఇటువంటి వారికి భరోసా ఉండేవి.


ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుండేది..
-మంగాయమ్మ

ప్రభుత్వపరంగా వృద్ధాశ్రమాలు పెడితే మాలాంటి వారికి ఉపయుక్తంగా ఉండేవి. జగన్‌ వృద్ధాశ్రమాలు పెడతానంటే సంబరపడ్డాం. మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. అయినా ఆయన ఇచ్చిన హామీ నెరవేరలేదు. అశోక్‌నగర్‌లో దాతలు సాయంతో నడుస్తున్న వృద్ధాశ్రమంలో ఆరు నెలలుగా వసతి పొందుతున్నా. వారి వద్ద రోజూ ఉచితంగా తినడం బాధగా ఉంది.


దాతలకు  ఏదీ చేయూత
-జగతా రమణ

ప్రభుత్వం ఎలాగూ వృద్ధాశ్రమాలు పెట్టలేదు. పోనీ దాతలు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో నడుస్తున్న  ఆశ్రమాలకైనా ప్రభుత్వపరంగా తోడ్పాటునిస్తే బాగుంటుంది. ఆశ్రమాలు నిర్వహించే భవనాలకు అద్దెలు, విద్యుత్తు బిల్లులు, భోజనాలకు నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులు చూసి బాధేస్తోంది.

జిల్లాలో ఆసరాలేని వృద్ధులు సుమారు 10 వేల మంది
స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వృద్ధాశ్రమాలు 15
కాకినాడలో ఉన్నవి 5
వసతి పొందుతున్నవారు 200 మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని