Vikky Pahade: ‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన

ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన  భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. 

Updated : 06 May 2024 16:03 IST

చింద్వారా:  ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF)సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి  స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యులు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  ఐఏఎఫ్‌ కాన్వాయ్‌పై జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ లో శనివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ మరణించారు. 

సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్కీ సోదరి గీతాపహాడే మీడియాతో మాట్లాడుతూ ‘‘నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా. శనివారం సాయంత్రం 6:30 గంటలకు అతడు ఉగ్ర దాడిలో గాయపడ్డాడని మాకు సమాచారం వచ్చింది. అనంతరం నా సోదరుడు వీరమరణం పొందాడని తెలిసింది. అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. గీతా పహాడే భర్త మాట్లాడుతూ... ‘‘వారి కుటుంబంలో విక్కీ ఒక్కగానొక్క కుమారుడు. అతడి మరణంతో ఐదేళ్ల కుమారుడు తండ్రి లేని వాడయ్యాడు. అయినా విక్కీ దేశం కోసం ప్రాణాలివ్వడం మాకు గర్వకారణం’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. 

విక్కీ పహాడేకు భారత వైమానిక దళం ఆదివారం సంతాపం తెలిపింది. ‘‘పూంచ్ సెక్టార్‌లో జరిగిన దాడిలో అత్యున్నత త్యాగం చేసిన వీరుడు కార్పోరల్ విక్కీ పహాడేకు భారతీయ వైమానిక దళం సెల్యూట్‌ చేస్తూ నివాళులర్పిస్తుంది. సైనికుడి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో మేము మీ వెన్నంటే ఉంటాము ’’అని ఐఏఎఫ్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.

శనివారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ ప్రాంతంలో భారత వైమానిక దళం కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో పలువురు సైనికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయాలవడంతో విక్కీ చికిత్స పొందుతూ మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు