PM modi: కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వం: మోదీ

దేశానికి ఇది స్వర్ణ సమయమని, దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

Updated : 08 Jul 2023 14:26 IST

TSPSC స్కామ్‌తో యువతకు మోసం

వరంగల్‌ సభలో ప్రధాని మోదీ

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వరంగల్‌: దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి ఇది స్వర్ణ యుగమని చెప్పారు. వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ జాతీయరహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ జాతీయరహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.

‘‘ తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయింది. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర. అభివృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక. రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. అనేక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం పార్టీ నేతలు మాట్లాడారు. ఆ తర్వాత మరోసారి మోదీ ప్రసంగించారు. భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమదేవీలను ప్రధాని స్మరించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ పౌరుషానికి ప్రతీకలని చెప్పారు. రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై  మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.‘‘ కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది. అత్యంత అవినీతి ప్రభుత్వం. కేసీఆర్‌ సర్కారు అవినీతి దిల్లీ వరకూ పాకింది. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోంది. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి. తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం. ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసింది’’ అంటూ మండిపడ్డారు.

కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్‌ సర్కారు పనిగా పెట్టుకుందని మోదీ విమర్శించారు. ఇలాంటి కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అవినీతి పాలనను దేశమంతా చూసిందని,  కేసీఆర్‌ అవినీతి పాలనను చూస్తోందని అన్నారు. ఈ రెండు పార్టీలను పత్తాలేకుండా చేస్తామన్నారు. ‘‘ కేసీఆర్‌ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. యువతను మోసం చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి కేసీఆర్‌ మోసం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ స్కామ్‌ ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం యువతను మోసం చేసింది. తెలంగాణ వర్సిటీలో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేశారు.’’ అని మోదీ అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్‌లందరూ ఆగ్రహంతో ఉన్నారని మోదీ అన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోందని, గత 9 ఏళ్లలో కేంద్రం రూ. లక్ష కోట్లకుపైగా నిధులిచ్చిందని చెప్పారు. మద్దతు ధర ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. ‘‘ తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇచ్చాం. ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు. మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నాం. కేంద్రం ఇన్ని చేస్తుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోంది?’’ అని మోదీ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని