Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసు

ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్‌కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బంధువు.. శ్రీనివాస్‌కు సిట్‌ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చారు.

Updated : 18 Nov 2022 05:37 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు.. శ్రీనివాస్‌కు సిట్‌ అధికారులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. ఈనెల 21న ఉదయం 10.30గంటలకు బంజారాహిల్స్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్‌ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరించాలని, తాను ఉపయోగించే సెల్‌ఫోన్‌ను సైతం తీసుకురావాలని చెప్పారు. దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడొద్దని, విదేశాలకు వెళ్లొద్దని పోలీసులు పేర్కొన్నారు. సింహయాజీకి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు శ్రీనివాస్‌ విమానం టికెట్‌ బుక్‌ చేసినట్టు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

కేరళకు చెందిన తుషార్‌కు సైతం సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఆయన్ను కూడా ఈనెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తుషార్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. వయనాడ్‌ నియోజకవర్గం నుంచి ఎన్డీయే తరఫున తుషార్‌ పోటీ చేశారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో గత నెల 26న నలుగురు తెరాస ఎమ్మెల్యేలతో రామచంద్రభారతి మాట్లాడుతున్న సమయంలో తుషార్‌, బీఎల్‌ సంతోష్ పేరును తరచూ ప్రస్తావించారు. తుషార్‌కు రామచంద్రభారతికి మధ్యవర్తిగా డాక్టర్‌ జగ్గుస్వామి వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేరళలోని ఓ ప్రముఖ ఆశ్రమానికి అనుసంధానంగా ఉన్న వైద్య కళాశాలలో జగ్గుస్వామి వైద్యుడిగా పనిచేస్తున్నట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. జగ్గుస్వామి కోసం కొచ్చితో పాటు కొల్లంలోనూ సోదాలు నిర్వహించారు. కానీ, ఆయన ఆచూకీ లభించలేదు. జగ్గుస్వామిని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని