5 సూపర్‌ ఫుడ్స్‌తో.. రక్తపోటుకు చెక్‌!

భారతదేశంలో జీవనశైలి వల్ల అత్యంత సాధారణంగా వచ్చే వ్యాధుల్లో రక్తపోటు ప్రధానమైంది. రక్తపోటు స్థాయి పెరిగితే గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్ లాంటి

Updated : 24 Jun 2021 12:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశంలో జీవనశైలి వల్ల అత్యంత సాధారణంగా వచ్చే వ్యాధుల్లో రక్తపోటు ప్రధానమైంది. రక్తపోటు స్థాయి పెరిగితే గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్ లాంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీనిని ‘సైలెంట్‌ కిల్లర్‌’గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలా మంది పని ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కాలంలో ఇంటి నుంచి పని నేపథ్యంలో.. పని గంటలు పెరగడంతో ఉద్యోగులు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా రక్తపోటుకు మరో కారణం. తరుచుగా తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కులోంచి రక్తం కారడం లాంటివి అధిక రక్తపోటు ప్రాథమిక లక్షణాలు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అందరూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే మన రోజువారీ భోజనంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూసేద్దాం.. 

దానిమ్మ: 
తినడానికి ఎంతో రుచికరంగా ఉండే దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్‌ పాలీ ఫినోల్స్‌ విరివిగా ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి మధ్య సమయంలో ఓ కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

నేరేడు పండు: 
నేరేడు పండు తినడం ద్వారా శరీరంలోని కండరాలకు అవసరమైన పొటాషియం విరివిగా లభిస్తుంది. రక్తపోటు నియంత్రణకు ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర నిల్వలను అదుపు చేయడంలో ఇది అద్భుత ఫలితాలనిస్తుంది.

 

బీట్‌రూట్‌: 
బీట్‌రూట్‌లో సహజ నైట్రేట్లు ఉంటాయి. మన శరీరంలోని జీర్ణవ్యవస్థ ద్వారా అవి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. ఒక గ్లాసు తాజా బీట్‌రూట్‌ రసం లేదా వండిన బీట్‌రూట్‌.. తీసుకున్న 2-3 గంటల్లోనే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

వెల్లుల్లి: 
తరతరాలుగా మంచి ఔషధ గుణాలున్న ఆహార పదార్థంగా వెల్లుల్లి ప్రసిద్ధి చెందింది. దీనిని నలిపినప్పుడు అలిసిన్‌ అనే ఓ సహజ రసాయనం ఉత్పత్తి అవుతుంది. అధిక రక్తపోటును అదుపులోకి తీసుకురావడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారంతా తమ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.

 

మెంతులు/ మెంతికూర: 
మెంతులు, మెంతి ఆకుల్లో కాల్షియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించడం.. తద్వారా రక్తపోటును అదుపులోకి తీసుకురావడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. వీలైనంత ఎక్కువగా వీటిని మన భోజనంలో చేర్చడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. 

రక్తపోటుపై ఆహార పదార్థాలు సైతం అధిక ప్రభావం చూపుతాయనే విషయం తెలిసిందే. అయితే దీనికి శారీరక వ్యాయామం తోడైతే రక్తపోటును మరింత సమర్థంగా అదుపులోకి తీసుకురావచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసే వారు శరీరానికి తగినంత విశ్రాంతి లభించే విధంగా నిద్రకు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని