CM Jagan: బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు వేయొద్దు: జగన్‌ 

యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు.

Published : 28 Sep 2021 01:28 IST

అమరావతి: యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. తుపాను అనంతర పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సీఎంకు వివరించారు. జిల్లాలోని 12 మండలాల్లో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 38 పునరావాస కేంద్రాల్లో 1514 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్‌ సీఎంకు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని వెంటనే ఇవ్వాలని.. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. 

‘‘బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు వేయొద్దు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలి. మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి. అవసరమైన అన్ని చోట్లా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. విశాఖ నగరంలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనిని ముమ్మరంగా చేపట్టాలి. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు రూ.1000 చొప్పున సాయం అందించాలి. సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 ఇవ్వాలి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేపట్టాలి. నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు