Covid Restrictions: ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ ఆంక్షలు ఎలా ఉన్నాయంటే..!

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Updated : 16 Aug 2021 03:37 IST

కరోనా ఉద్ధృతి పెరగడంతో నిబంధనలు విధిస్తున్న రాష్ట్రాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉండాలని కొన్ని రాష్ట్రాలు నిబంధనలు విధిస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం క్వారంటైన్‌ నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు మాత్రం రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎటువంటి పరీక్షలు అవసరం లేదని చెబుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మాత్రం ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి నిబంధనపై పునఃపరిశీలన చేసుకోవాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తోంది.

పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఇలా..

* కేరళ నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చేవారికి ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి అని తమిళనాడు పేర్కొంది.

* మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారికి RTPCR నెగిటివ్‌ ఉంటేనే అనుమతి ఇస్తామని కర్ణాటక చెబుతోంది.

* అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌ కూడా ఇదే విధమైన నిబంధన విధించింది.

* గోవా మాత్రం కేవలం కేరళ నుంచి వచ్చే వారిని మాత్రమే నెగిటివ్‌ రిపోర్టు అడుగుతోంది. ఇప్పటికే గోవాలో 90శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అందజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

* పుణె, ముంబయి, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాలని పశ్చిమ బెంగాల్‌ అధికారులు పేర్కొంటున్నారు.

* విమాన ప్రయాణం చేసేవారందరూ ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టు చూపించాలని మహారాష్ట్ర నిబంధన విధించింది.

ఇక వివిధ రాష్ట్రాల్లో విధించిన కొవిడ్‌ ఆంక్షలపై ఎప్పటికప్పుడు సమాచారం పొందుపరుస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వచ్చినప్పుడు సరైన విధంగా ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు కలిగి ఉండకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించడం, కొవిడ్‌ పరీక్ష నిర్వహించడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటారని రైల్వేశాఖ తెలిపింది. రాజ్యాంగ విధులు నిర్వహించే వారు, వారి కుటుంబీకులు, ఆరోగ్య వృత్తి నిపుణులకు, 2 సంవత్సరాలలోపు చిన్నారులు వంటి వారికి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంచే ప్రత్యేకంగా పేర్కొన్న వారికి ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. రైలు ప్రయాణికులు ప్రయాణానికి ముందు తాము వెళ్లే గమ్య స్థానాలకు సంబంధించిన రాష్ట్రాలలో విధించిన నియమ నిబంధనలు తెలుసుకోవడానికి ఇండియన్‌ రైల్వేస్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌లో చూసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని