
Ts News: 300 స్టాల్స్.. 20 రోజులు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫెస్టివల్ మేళా
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫెస్టివల్ మేళా, మినీ నుమాయిష్‌ను నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ఫెస్టివల్ మేళా నిర్వహించబోతున్నామని సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ మేళా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం నుమాయిష్ నిర్వహించకపోవడంతో కరోనా కష్టాలలో ఉన్న చిన్న పరిశ్రమలు, చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాను 300 స్టాల్స్ తో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్‌కు సంబంధించిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు ఈ మేళాను ప్రారంభించనున్నారని ప్రభా శంకర్ తెలిపారు.