Kadapa: బాలికల వసతి గృహానికి సరకుల నిలిపివేత.. పాఠశాల ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ వేటు

కడప జిల్లా ఖాజీపేట ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉదయం టీవీలో ప్రసారమైన వార్తకు స్పందన వచ్చింది. ఆదర్శ పాఠశాల వసతి

Updated : 07 Dec 2021 22:11 IST

ఖాజీపేట: కడప జిల్లా ఖాజీపేట ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉదయం టీవీలో ప్రసారమైన వార్తకు స్పందన వచ్చింది. ఆదర్శ పాఠశాల వసతి గృహంలో భోజనాలు లేక 80 మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న విషయంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సర్వ శిక్ష అభియాన్ ఏపీడీ దేవరాజ్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉన్నతాధికారులకు లేఖ రాసిన పాఠశాల ప్రిన్సిపల్‌ సురేష్‌తో ఏపీడీ దేవరాజ్‌ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందించిన ఏపీడీ.. వెంటనే ఇవాళ రాత్రి నుంచే పిల్లలకు భోజనాలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజన వసతి కల్పించారు. రేపు మొత్తం 80 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బిల్లులు చెల్లించలేదని కడప జిల్లా ఖాజీపేట ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి గుత్తేదారు నిత్యావసర సరకుల సరఫరా నిలిపివేశారు. దీంతో వసతి గృహంలో భోజన వసతి లేకపోవడంతో కొంత మంది విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. సరకుల నిలిపివేతపై ఈ నెల 4న ఉన్నతాధికారులకు పాఠశాల ప్రిన్సిపల్‌ సురేష్ లేఖ రాశారు. ప్రిన్సిపల్‌ లేఖపై విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. పాఠశాల వసతి గృహంలో మొత్తంగా 80 మంది విద్యార్థినులు ఉంటున్నారు. తాజాగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థినులకు భోజన ఏర్పాట్లు చేశారు.

ప్రిన్సిపల్‌ సురేష్‌బాబుపై సస్పెన్షన్ వేటు‌..

ఖాజీపేట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ సురేష్‌బాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రిన్సిపల్‌ సురేష్‌బాబును ఆర్‌జేడీ కృష్ణారెడ్డి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలిందని ఆర్‌జేడీ తెలిపారు. సురేష్‌బాబు స్థానంలో జయభారతికి పాఠశాల ప్రిన్సిపల్‌ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని