Ts News: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలను నియమిస్తూ  కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 16న కొలీజియం సిఫారసుకు రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర న్యాయశాఖ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్‌ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు....

Updated : 13 Oct 2021 20:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 16న కొలీజియం పంపిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర న్యాయశాఖ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్‌ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఏడుగురు పేర్లను సెప్టెంబరు 16న  సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు సిఫార్సు చేశారు. కొత్తగా ఏడుగురు జడ్జిల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరిగింది.

నూతన న్యాయమూర్తుల ప్రస్థానమిది

పి.శ్రీసుధ : 1967 జూన్‌ 6న నెల్లూరులో జన్మించారు. 1992లో న్యాయవాదిగా నమోదై 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా, వ్యాట్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌గా విధులు నిర్వహించారు.

సి.సుమలత : 1972 ఫిబ్రవరి 5న నెల్లూరులో జన్మించారు. 1995లో పద్మావతి మహిళా యూనివర్సిటీ (తిరుపతి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రైట్‌ టు టైమ్‌లీ జస్టిస్‌ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. జిల్లా జడ్జిగా 2007లో ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరుల్లో పనిచేశారు. జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా కొనసాగుతున్నారు.

డాక్టర్‌ గురిజాల రాధారాణి : 1963 జూన్‌ 29 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఎం.లక్ష్మణ్‌ :  1965 డిసెంబరు 24న వికారాబాద్‌ జిల్లా వేల్చల్‌ గ్రామంలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జిల్లా జడ్జిగా ఎంపికై మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం కార్మిక న్యాయస్థానం కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్‌.తుకారాంజీ :  1973 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించారు. 1996లో న్యాయవాదిగా నమోదయ్యారు.  హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2007 జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా ఉన్నారు.

ఎ.వెంకటేశ్వరరెడ్డి : 1961 ఏప్రిల్‌ 15న మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1987లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1994 జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లా జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు చేపట్టి అందులోనే కొనసాగుతున్నారు.

పి.మాధవిదేవి : 1965 డిసెంబరు 28న హైదరాబాద్‌లో జన్మించారు. గుల్బర్గాలో ఎల్‌ఎల్‌బీ.. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేపట్టారు. 2005లో ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సర్వీసులో చేరారు. ముంబయి, బెంగళూరుల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని