కుమార్తెకు కన్యాదానం చేసి బ్లాంక్ చెక్ ఇచ్చిన తండ్రి.. ఎందుకో తెలుసా..?

జీవితంలో మధురఘట్టమైన పెళ్లివేడుక నాడు విశాల హృదయం చాటింది ఆ అమ్మాయి. తన కుమార్తె ఆశయాన్ని తీర్చి.. ఆ వేడుకను అందంగా మలిచాడు ఆ తండ్రి. ఆ వేడుక రోజున ఆ తండ్రీకూతురు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఓ వార్త సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. 

Updated : 26 Nov 2021 14:19 IST

అది కూడా కూతురి ఆశయం కోసమే..

జైపూర్‌: జీవితంలో మధురఘట్టమైన పెళ్లివేడుక నాడు విశాల హృదయం చాటింది ఆ అమ్మాయి. తన కుమార్తె ఆశయాన్ని తీర్చి.. ఆ వేడుకను అందంగా మలిచాడు ఆ తండ్రి. ఆ వేడుక రోజున ఆ తండ్రీకూతుళ్లు  తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిశోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలీ కన్వార్‌ను ప్రవీణ్‌ సింగ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుక నవంబర్ 21న జరిగింది. కుమార్తెను అత్తింటికి పంపేప్పుడు పుట్టింటి నుంచి రూ.75 లక్షలు కానుకగా ఇవ్వాలని కనోడ్‌ ముందుగానే ఆ మొత్తాన్ని పక్కన పెట్టుకున్నారు. అయితే పెళ్లికి ముందే అంజలీ తన తండ్రి వద్దకు వెళ్లి తన మనసులో మాటను బయటపెట్టింది. తన కోసం కేటాయించిన ఆ సొమ్మును బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వెచ్చించాలని కోరింది. వారి కోసం వసతి గృహం కట్టించేందుకు ఇవ్వాలని అడిగింది. తన కుమార్తె తపనను అర్థం చేసుకున్న ఆ తండ్రి సంతోషంగా ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించి.. ఆమె చేతిలో బ్లాంక్ చెక్ పెట్టారు. ఎంత డబ్బు కావాలో దాంట్లో రాసుకోమని ప్రోత్సహించారు.

మరో విషయం ఏంటంటే కనోడ్‌ గతంలోనే ఓ హాస్టల్ నిర్మాణానికి కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చారు. అయితే దాని నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.50 నుంచి రూ.75 లక్షలు అవసరం కానున్నాయి. ఆ డబ్బునే ఇప్పుడు ఆయన కుమార్తె సమకూర్చింది. ఈ తండ్రీకూతుళ్లు కలిసి బాలికల విద్యకోసం చూపిన చొరవను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కన్యాదానం వేళ..ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు