icon icon icon
icon icon icon

నరసాపురం.. కూటమిదే బలం!

సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్‌.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్‌.. ఇదీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి.

Updated : 05 May 2024 11:13 IST

ఐదుచోట్ల తెదేపా-జనసేన అభ్యర్థుల గెలుపు ఏకపక్షమే!
రెండు నియోజకవర్గాల్లో వైకాపా అడ్డదారులు
గోదావరి పారే చోట క్రాప్‌హాలీడే ప్రకటనపై జనాగ్రహం
ప్రభుత్వ విధానాలతో నష్టపోయిన అక్వా రంగం
ఐదేళ్లలో పెరిగిన భూకబ్జాలు, జే,కే ట్యాక్స్‌లతో వసూళ్లు

సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్‌.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్‌.. ఇదీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి. ఐదేళ్ల వైకాపా పాలనలో పడిన ఇబ్బందులు ఒకటా, రెండా ఎన్నని చెప్పాలని రైతుల నుంచి చిరువ్యాపారుల వరకు అందరూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఆక్వా సంక్షోభంలో కూరుకుపోయిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి నరసాపురం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఒక్కసారని అధికారమిస్తే భవిష్యత్తును చీకటి చేశారంటూ ప్రభుత్వ వ్యతిరేకత వినిపించింది. వార్‌ వన్‌ సైడే అని తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు గళం విన్పించారు.

‘నరసాపురం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి’

ఐదింట అనుకూలం.. రెండు హోరాహోరీ

నరసాపురం లోక్‌సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎక్కడా కొత్త రోడ్లు వేయలేదు. ప్రధాన పట్టణాల్లో అంతర్గత రోడ్లను విస్మరించింది. గత ఎన్నికల్లో నియోజకవర్గాల ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదనే వ్యతిరేకత కనిపించింది. ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే శెట్టిబలిజ, కాపు సామాజికవర్గాలు ఏకతాటిపైకి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఎస్సీ వర్గం కూడా కూటమి వైపు మొగ్గు చూపుతోంది. బీసీ, ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా నరసాపురం లోక్‌సభ స్థానాన్ని బీసీ మహిళ గూడూరి ఉమాబాలకు కేటాయించింది. పొత్తులో భాగంగా ఇక్కడ భాజపా తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీచేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు పొత్తు పార్టీలతో సన్నిహిత సంబంధాలుండటం సానుకూలం. సామాజిక సమీకరణలతో నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తాడేపల్లిగూడెం, తణకు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమేననే చర్చ సాగుతోంది. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉన్నా కూటమి అభ్యర్థులకే అనుకూల వాతావరణం ఉందని అక్కడి ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. ఈ దఫా క్లీన్‌స్వీప్‌ పక్కా అని మొగల్తూరుకు చెందిన వ్యాపారి చెప్పారు. ఓట్లు పోతాయనే భయంతో వారంనుంచి రోడ్లు మరమ్మతు చేస్తున్నారని వివరించారు. ‘నా వయసు 68 ఏళ్లు. ఇన్నేళ్లలో ఇలాంటి పాలనను చూడలేదు. అభివృద్ధిని పక్కనపెట్టి జనానికి డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారు’ అని భీమవరం ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది చెప్పారు. అధికార పార్టీ జిమ్మిక్కులు ఈసారి  పనిచేయవని, లోక్‌సభ పరిధిలో వైకాపా మళ్లీ గెలవడం కష్టమేనని తణుకులో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తేల్చిచెప్పారు.


ఏం ప్రభుత్వమండీ! నాలుగేళ్లలో నరకం చూశాం. ఎన్నికలకు ముందు ఏవో చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే మాట మార్చారు. తెదేపా ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు తీసేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచేశారు. రొయ్యపిల్లను కొనాలంటే భయమేస్తోంది. ఇన్నేళ్లు ఈ సాగునే నమ్ముకున్న మేం కొత్తగా ఏం చేయలేక నష్టాలు భరిస్తున్నాం. ఆస్తులు అమ్ముకొని పరువు కాపాడుకుంటున్నాం.

ఉండి ప్రాంతానికి చెందిన అక్వా రైతు ఆవేదన.

ఐదేళ్ల కిందట వేసిన రోడ్లే దిక్కు. పేరుకే పెద్ద పట్టణం. ఎటువైపు వెళ్లాలన్నా గోతులే. కాలువల్లో మురుగు తీయరు. అడిగితే ఏం చేస్తారోననే భయం. కబ్జాలు, భూదందాలు చేసేవారిని గెలిపించి తప్పు చేశామో అనే బాధ ఉంది.

భీమవరంలో నలుగురు ఆటోడ్రైవర్లు, ఇద్దరు చిరువ్యాపారుల అంతరంగం.

చెప్పటానికి ఏటుందండీ! ఒక్క ఛాన్స్‌ అని మోసపోయాం. మా డబ్బులు మాకే ఇచ్చి ఉచితమంటుంటే నవ్వుకుంటున్నాం. ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నాం. తాపీ పనికి కూలీగా వెళ్లేవాళ్లం. సరిగా పనుల్లేక రొయ్యలు, చేపల దుకాణాల్లో పని చేస్తున్నాం.

ఆచంటలో నలుగురు తాపీ కూలీలు

‘పాలన ఏం బాగాలేదు సార్‌. ఇప్పటికీ ఏ ఒక్కటీ ముందడుగు వేయలేదు. వాటర్‌గ్రిడ్‌ పూర్తి చేయలేకపోయారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏమైందో తెలియదు. ఇంకోసారి కూడా వీళ్లే ఉంటే ఏపీ గతి ఏమవుతుందో?

నరసాపురంలో ఓ యువకుడి అంతర్మథనం.


ఆచంట.. ‘పితాని’కే అనుకూలం!

ఇక్కడి నుంచి వైకాపా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎదిగిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు హామీలు నెరవేర్చలేకపోయారన్న వ్యతిరేకత ఉంది. తెదేపా అభ్యర్థి పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన రహదారులు, తాగునీటి పథకాలే ఆదుకుంటున్నాయని గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి ఆయన వస్తేనే ఇక్కడ అర్ధంతరంగా నిలిచిన పథకాలు పట్టాలెక్కుతాయని భావిస్తున్నారు. తనను గెలిపిస్తే ఆయోధ్యలంక వారధి పూర్తి చేయిస్తానని చెప్పిన శ్రీరంగనాథరాజు గెలిచాక ముఖం చాటేశారు. కొద్దిరోజుల ముందు వరకూ ఎవరైనా కలిసేందుకు వెళ్లినా కోపగించుకోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.లంక గ్రామాల వైపు కన్నెత్తి చూడని ఆయన అనుచరులతో ఇసుక దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కసారని ఓటేస్తే మరోసారి అటువైపు చూసే ధైర్యం లేకుండా చేశారని ఆచంటకు చెందిన కండక్టర్‌ ఒకరు తెలిపారు. ఈ దఫా పితాని సత్యనారాయణకు అనుకూల వాతావరణం కనిపించింది.


ఉండిలో.. హోరాహోరీ

తెదేపా తరఫున ఇక్కడి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీచేస్తున్నారు. రెండుసార్లు తెదేపా తరఫున గెలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) టికెట్‌ రాకపోవటంతో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెదేపా చేతిలో ఓడిన వైకాపా అభ్యర్థి పెన్మత్స వెంకటలక్ష్మీ నరసింహరాజు (పీవీఎల్‌ఎన్‌ రాజు) మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వైకాపా, తెదేపా మధ్య ప్రధాన పోటీ అనుకున్నా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రాకతో ముక్కోణ పోటీ నెలకొంది. ఎదురుగాలిలోనూ తెదేపా అభ్యర్థిని గెలిపించాం.. ఇప్పుడూ ఆ పార్టీ వెంటే నడుస్తామని స్థానిక వ్యాపారి తెలిపారు.


నరసాపురంలో.. ‘నాయకర్‌’

‘నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్నే ఎగతాళి చేస్తారు. ఆఫీసుకెళితే పట్టించుకోరు. జనంతో కలిసిపోయే నాయకుడినే ఈసారి గెలిపించుకుంటాం..’ నరసాపురంలో మార్నింగ్‌వాక్‌కు వచ్చిన పది మంది స్థానికులతో మాట్లాడినప్పుడు ఆరుగురి అభిప్రాయమిది. వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదునూరి నాగరాజ వరప్రసాద్‌రాజుపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. కొద్ది మందికే ప్రాధాన్యమిస్తూ పార్టీ కోసం కష్టపడేవాళ్లను దూరంగా ఉంచటంతో క్యాడర్‌ చెల్లాచెదురైంది. జలజీవన్‌ మిషన్‌తో ఏటిపట్టు గ్రామాల్లో తాగునీటి సమస్య తీరుస్తానంటూ ఇచ్చిన మాట నీటిమూటయింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన బొమ్మిడి నాయకర్‌పై సానుభూతితోపాటు బీసీ, కాపుల ఓట్లు విజయావకాశాలను పెంచాయని అంటున్నారు. తెదేపా సీనియర్‌ నేతలు కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం బలాన్ని పెంచింది. సిటింగ్‌ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, అభివృద్ధి కార్యక్రమాలు పునాదిలోనే ఉండటంతో ఈ దఫా కూటమి అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


పాలకొల్లులో హ్యాట్రిక్‌పై ‘నిమ్మల’ గురి

నియోజకవర్గంలో ఏదోలా గెలిచి పరువు కాపాడుకోవాలని వైకాపా అడ్డదారులు వెతుకుతోంది. సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. తెదేపా నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడికి నియోజకవర్గంలో పట్టుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా స్పందిస్తారనే గుర్తింపు ఉంది. తెదేపా హయాంలోనే పాలకొల్లులో అభివృద్ధి జరిగిందని పట్టణానికి చెందిన కొబ్బరికాయల వ్యాపారి తెలిపారు. ఎన్టీఆర్‌ కళాక్షేత్రం, ఉద్యానవనం పూర్తిచేసినా.. దాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రభుత్వం విముఖత చూపింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఉన్న కక్షతో అభివృద్ధిని అడ్డుకున్నారని ప్రజలు బాహాటంగానే వివరిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత, జనసేన, భాజపా పొత్తు వల్ల చేకూరిన లబ్ధితో హ్యాట్రిక్‌పై రామానాయుడు గురిపెట్టారు. వైకాపా అభ్యర్థిగా గుడాల శ్రీహరిగోపాలకృష్ణ (గోపి)ని ఏడు నెలల కిందటే ప్రకటించారు. ఆ సీటుపై ఆశ పెంచుకున్న పార్టీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. గోపి స్థానికేతరుడంటూ ప్రచారం చేస్తున్నారు. వర్గపోరుతో ఎన్నికల ప్రచారం మందకొడిగా సాగుతోంది. బీసీలు/కాపుల ఓట్లను చీల్చేందుకు వైకాపా అడ్డదారులు తొక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.


భీమవరం.. ‘పులవర్తి’కే పట్టం

భీమవరం రాజకీయం రసకందాయంగా మారింది. ఐదేళ్లుగా వైకాపా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ సాగించిన దౌర్జన్యాలు, భూదందాలు, నెరవేరని హామీలతో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిన పులవర్తి ఆంజనేయులు (అంజిబాబు) ఈసారి జనసేన నుంచి తలపడుతున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబు వైపే జనం మొగ్గు కనిపిస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే గ్రంథి తీరుతో విసుగెత్తినవారు మార్పు ఆశిస్తున్నారని పట్టణానికి చెందిన ఒక ఆటోడ్రైవర్‌ తెలిపారు. ఊరి మధ్యలో ఆసుపత్రి కడతామని హామీనిచ్చి 8 కిలోమీటర్ల దూరానికి మార్చారని. ఐదేళ్లుగా దాన్నీ పూర్తి చేయలేకపోయారని విశ్రాంత ఉద్యోగి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతులతో విదేశీ మారకద్రవ్యం సంపాదించి పెడుతున్న అక్వా సాగును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని లోసరి గ్రామానికి చెందిన ఇద్దరు అక్వా రైతులు తెలిపారు. తెదేపా హయాంలో ఇచ్చిన విద్యుత్‌ రాయితీలు, ప్రోత్సాహకాలు తీసేయటంతో నష్టపోతున్నామని అంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు విన్నవించినా నిష్ఫలమైందని వివరించారు. ఒక గ్రామంలో ఎస్సీ సర్పంచిపై దాడితో ఆ వర్గం వ్యతిరేకంగా మారింది.


గూడెం నుంచే మార్పు మొదలు

తాడేపల్లిగూడెం నుంచి వైకాపా తరఫున గెలిచి, మంత్రి పదవి చేపట్టిన కొట్టు సత్యనారాయణపై నియోజకవర్గవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. ఆయనకు టికెటిస్తే పనిచేయబోమంటూ కొందరు పార్టీ పెద్దలకే తేల్చిచెప్పారు. అభివృద్ధిని గాలికొదిలేసి అవినీతి, అక్రమాలతో కొట్టు అడ్డగోలుగా దోచుకున్నారని ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. పొత్తులో భాగంగా ఇక్కడ టిక్కెట్‌ జనసేన దక్కించుకోవటంతో బొలిశెట్టి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. గతంలో మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జనసేన, తెదేపాకు బలమైన క్యాడర్‌ ఉండటం, వీరంతా కలసికట్టుగా పనిచేస్తుండటంతో బొలిశెట్టి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు. ఉమ్మడిగోదావరి జిల్లాలో మార్పు తమ నియోజకవర్గం నుంచే మొదలవుతుందని తాడేపల్లిగూడెంలోని నలుగురు వ్యాపారులు ధీమా వ్యక్తం చేశారు.


తణుకులో ఆరిమిల్లి గెలుపు.. ఏకపక్షమే!

తణుకులో తెదేపా గెలుపు ఏకపక్షమేనని ప్రచారమవుతోంది. గత ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో ఓడిన తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ పట్ల సానుభూతి ఉంది. తెదేపా సంస్థాగత బలం, జనసేన ఓటింగ్‌ కలిసి ఈసారి ఆరిమిల్లికి ఘనవిజయం సాధించిపెట్టబోతున్నాయి. వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చాలా ఆరోపణలున్నాయి. టీడీఆర్‌ బాండ్ల అక్రమాల్లో మంత్రి పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. మాది రైతుల ప్రభుత్వమంటూ జగన్‌ గొప్పలు చెబుతుంటే.. కారుమూరి అదే రైతులను నోటికొచ్చినట్లు తిట్టడం సంచలనమైంది. ఎన్నికల సమయంలో వైకాపా బలమైన క్యాడర్‌ తెదేపాలోకి చేరింది. మూడు పార్టీల పొత్తు, వైకాపా అంతర్గత వైరంతో కారుమూరి ఒంటరయ్యారని పార్టీలో ప్రచారం ఊపందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img