ప్రజ్వల్‌ రేవణ్న బాధితులు 500 మంది పైనే?

కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్‌ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్‌’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న కోసం ఇప్పటికే లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

Updated : 05 May 2024 06:48 IST

కర్ణాటకను కుదిపేస్తున్న వేధింపుల కేసు
నిందితులు దేవేగౌడ కుమారుడు, మనవడు

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్‌ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్‌’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న కోసం ఇప్పటికే లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తండ్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్నను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సిట్‌ ప్రకటించింది. అరెస్టుకు ఓ మహిళ కిడ్నాప్‌ కేసును ప్రాథమిక కారణంగా చూపారు. రేవణ్న దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిరాకరించింది. ఈ తీర్పు రాగానే బెంగళూరులోని మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నివాసంలో ఉన్న రేవణ్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రేవణ్న ఇప్పటికే మహిళలపై అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. బాధితులు ఐదారు వందల మంది వరకు ఉంటారని అనుమానిస్తున్నారు.

ఆమెకూ తాఖీదులు

రేవణ్న సతీమణి భవాని రేవణ్నకూ సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. హాసన జిల్లా హొళెనరసీపురలో భవాని లేని సమయంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు లైంగిక దౌర్జన్యాలకు గురైన బాధిత మహిళలను పోలీసులు హాసనలోని రేవణ్న నివాసానికి తీసుకొచ్చి విచారించారు. రేవణ్న నివాసంలో సహాయకురాలిగా ఉంటున్న ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఏ1గా రేవణ్న, ఏ2గా ఆయన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్న ఉన్నారు. ప్రజ్వల్‌ రేవణ్న కేసులో విచారణ వేగవంతం చేయాలని సీఎం సిద్ధరామయ్య సిట్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైతే బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేసి తక్షణమే అతనిని బంధించాలని ఆదేశించారు. ప్రజ్వల్‌ రేవణ్నకు సంబంధించిన కేసుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ‘బాధితుల మనుగడకు ఇబ్బందులు రాకుండా చూడాలి’ అని పేర్కొన్నారు. ఈ పరిమాణాలతో దేవేగౌడ మనస్తాపంతో అస్వస్థతకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని