ఆహారంతో వ్యాప్తి..ఆధారాల్లేవ్!

ఆహారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించినట్లు ఆధారాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది.

Published : 19 Sep 2020 11:55 IST

దిల్లీ: ఆహారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించినట్లు ఆధారాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా దీనికి సంబంధించి లోక్‌సభకు నివేదిక అందజేసింది. వైరస్‌తో ప్రభావితమైన దేశాల నుంచి దిగుమతి చేసిన ఆహారపదార్థాలను స్వీకరించడం సురక్షితమేనని వెల్లడించింది. చైనా, ఇతర దేశాల్లో వైరస్‌ వ్యాపించిన తరుణంలో అక్కడినుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవగా..ఆ అనుమానాలను నివృత్తి చేసే ఉద్దేశంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిపుణులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ మార్గదర్శకాలతో ఏకీభవించినట్లు కమిటీ నివేదికలో తెలిపింది.  ‘కరోనా వైరస్‌తో ప్రభావితమైన దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని నిరూపించే ఆధారాలు లేవని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది’ అని లోక్‌సభలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే వెల్లడించారు. 

కాగా, లాక్‌డౌన్ సమయంలో ఆహార పదార్థాల దిగుమతి క్లియరెన్స్‌లు, ల్యాబ్‌ల్లో వాటిని పరీక్షించడం వంటి చర్యలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కరోనా కాలంలో ఆహారపదార్థాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై  ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు,  ‘ఈట్ రైట్ డ్యూరింగ్‌ కొవిడ్-19’ అనే ఇ-హ్యాండ్ బుక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని