Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Jul 2021 13:37 IST

1. Tokyo olympics: లవ్లీనా సంచలనం.. పతకానికి అడుగు దూరమే..!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ (69కిలోలు) సంచలనం సృష్టించింది. మెగా క్రీడల్లో ఘనంగా అరంగేట్రం చేసింది. ప్రిక్వార్టర్స్‌లో జర్మన్‌ బాక్సర్‌ నడైన్‌ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తన తర్వాతి మ్యాచులో గెలిస్తే ఆమె కనీసం కాంస్యం ఖాయం చేసుకుంటుంది. తొలిరౌండ్లో లవ్లీనాకు బై లభించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tokyo olympics: నేటి భారతం.. శరత్‌ కమల్‌ ఇంటికి.. సాత్విక్‌ జోడీ గెలుపు.. గురి తప్పిన షూటింగ్‌

2. Jeff Bezos: నాసాకు రూ.15 వేల కోట్ల డిస్కౌంట్‌ ఇస్తానంటున్న బెజోస్‌!

అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీ ఆఫర్‌ ఇచ్చారు. 2024లో చంద్రునిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్‌ సిస్టం(హెచ్‌ఎల్‌ఎస్‌)ను బ్లూ ఆరిజిన్‌ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ ఎక్స్‌’తో ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్‌ ఇస్తామని కళ్లుచెదరే ఆఫర్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Viveka murder case: మరో ఏడుగురిని ప్రశ్నిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో 51వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఏడుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్‌ సతీశ్‌కుమార్‌, డా.మధు, కిశోర్‌కుమార్‌, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్‌ నాయక్‌ను అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

4. Petrol prices: పెట్రో ధరల ఏకరూపతకు పథకమేమీ లేదు: కేంద్రం

పెట్రో ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చేసే పథకమేదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్రోలియంశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ లోక్‌సభకు తెలిపారు. రవాణా ఛార్జీలు, వ్యాట్, స్థానిక పన్నులు వేర్వేరుగా ఉన్నందున పెట్రో ఉత్పత్తుల ధరలు ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నట్లు చెప్పారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Navarasa Trailer: అగ్ర తారల వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ అదరహో!

భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* RRR: అదిరిపోయే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థీమ్‌ సాంగ్‌.. గాయకులు వీరే

6. Green India Challenge: రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మొక్కలు నాటారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్‌బీతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్‌, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీని అమితాబ్‌ ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Vijay Mallya: రూ.6వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.14వేల కోట్లు జప్తు!

పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ‘దివాలా దారు’గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 180 రెట్లు ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయిన `త‌త్వ చింత‌న్` ఐపీఓ

8. Parliament Mansoon session: పార్లమెంట్‌లో కొనసాగిన నిరసనల హోరు

ఫోన్లపై నిఘా, రైతుల ఉద్యమ సంబంధిత ప్రస్తావనలతో మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగింది. ఈ అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొని ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెగాసస్‌, సాగు చట్టాలపై చర్చ జరపాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Raj kundra: కుంద్రా ప్లాన్‌-బి.. బాలీఫేమ్‌!

రాజ్‌ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న అశ్లీల చిత్రాల దందా కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్‌ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్‌ షాట్స్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్‌-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dating Game Killer: అమెరికా నరరూప రాక్షసుడు కన్నుమూత

10. Tokyo olympics: అమ్మాయిలపై ఆ దృష్టి మార్చేందుకు 

లింగ సమానత్వానికి ప్రాధాన్యమిచ్చిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్‌ అధికారిక ప్రసారదారు ప్రకటించింది. ‘‘స్పోర్ట్‌ అప్పీల్, నాట్‌ సెక్స్‌ అప్పీల్‌’’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఒలింపిక్స్‌ నిర్వాహకులు మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని