Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jan 2022 13:18 IST

1. Pegasus: పెగాసస్‌ను 2017లోనే భారత్‌ కొనుగోలు చేసింది..!

గతేడాది యావత్‌ దేశాన్ని కుదిపేసిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్‌కు కూడా డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. పెగాసస్‌ తయారీ సంస్థ ఎస్‌ఎస్‌వోతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Chiranjeevi: క్వారంటైన్‌ వల్ల తల్లిని కలవలేకపోతున్న చిరంజీవి

క్వారంటైన్‌లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని మెగాస్టార్‌ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. శనివారం తన తల్లి పుట్టినరోజు పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా చిరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోని ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Telangana News: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్‌ ఎప్పుడంటే?

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా.. కొన్ని రోజుల నుంచి పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యాసంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Telangana News: ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతాం: హరీశ్‌రావు

4. Congress: దేశం పేదరికంలో ఉంటే భాజపా ఆస్తులు 550% పెరిగాయ్‌..!

ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ (BJP) ఆస్తులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) పార్టీ దుయ్యబట్టింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) శుక్రవారం నివేదిక విడుదల చేసింది. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కిస్తే రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%)గా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Budget 2022: కొవిడ్‌ అస్థిరతకు బడ్జెట్‌ మాత్ర!

కొవిడ్‌ మహమ్మారి మన దేశ వైద్యారోగ్య వ్యవస్థ పటిష్ఠతకు పరీక్ష పెట్టింది. లోపాల్ని, లొసుగుల్ని ఎత్తిచూపి పాలకులు, పరిశ్రమ వర్గాలను అప్రమత్తం చేసింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందని గుర్తుచేసింది. దీంతో గత బడ్జెట్‌లో ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యాక్సిన్లు, ఔషధాలపై రాయితీలు కల్పించింది. తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయితే, కరోనా సృష్టించిన అస్థిర పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Team India: భారత జట్టు సురక్షితమైన కెప్టెన్‌చేతుల్లోనే ఉంది

విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ వివాదం టీమ్‌ఇండియాపై ప్రభావం చూపదని, ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మ చేతుల్లో జట్టు సురక్షితంగా ఉందని వెస్టిండీస్‌ మాజీ సారథి డారెన్‌ సామీ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన రాబట్టడం రోహిత్‌కు బాగా తెలుసన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్‌ను టీమ్‌ఇండియా సెలెక్టర్లు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అంతకుముందు అతడే స్వయంగా టీ20 సారథిగా తప్పుకొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వెస్టిండీస్‌ సిరీస్‌లకు ఆ నలుగురు అర్హులైన ఆటగాళ్లు: యువీ

7. India Corona: భారీగా మరణాలు.. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 300లకు పైగా..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 17 లక్షల మంది వైరస్ నిర్ధరాణ పరీక్షలు చేయించుకోగా.. 2,35,532 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 13.39 శాతానికి తగ్గిపోయింది. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. SBI: గర్భిణుల నియామకాల్లో మార్పులపై ఆగ్రహం.. ఎస్‌బీఐకి నోటీసులు..!

నియామక సమయానికి మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) జారీ చేసిన ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన దిల్లీ మహిళా కమిషన్‌.. ఎస్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. AP New Districts: రాజంపేటలో భారీ ర్యాలీ.. హిందూపురంలో అఖిలపక్షం బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేటలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఇవాళ రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు. పాత బస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించిన విద్యార్థులు నినాదాలు చేశారు. వీరితో పాటు న్యాయవాదుల ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు

10. AP PRC: ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారు?: బండి శ్రీనివాసరావు

పీఆర్సీ ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు జరుగుతున్నాయి. దీక్షల్లో బండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరుతున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని