Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 08 Nov 2021 17:15 IST

1.ఎవరు ప్రశ్నిస్తే వారు దేశ ద్రోహులా..?: సీఎం కేసీఆర్‌

‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. దిల్లీలో రైతు ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్‌.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..?’’ అని కేసీఆర్‌ అన్నారు.

2.పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా?: పేర్ని నాని

పెట్రోల్‌ ధరను రూ.116 వరకూ ఎవరు తీసుకెళ్లారని.. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్‌ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

3.మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ

రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్‌ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు.

4.కేంద్రం నిర్ణయాలు తీసుకున్న వెంటనే రాష్ట్రాలు తీసుకోలేవు: బుగ్గన

రాష్ట్రానికి ఎక్సైజ్‌ ద్వారానే ఆదాయం వస్తుందని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నంత సులభంగా రాష్ట్రం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. పెట్రో ధరలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు.. కేంద్రానికి ఉండేవి వేరని.. ఇప్పటికే పెంచిన పన్నును కొంతమేర తగ్గించినట్లు పేర్కొన్నారు.

5.రైతులు కార్లలో ఎక్కడ తిరుగుతున్నారో కేసీఆర్‌ చెప్పాలి: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అబద్ధాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, మంత్రి వర్గ సమావేశాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ నిన్న మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా తీరును ఎండగట్టిన నేపథ్యంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

6.బకాయిలను చెల్లించండి.. లీటరుకు రూ.5 పెంచితేనే సరఫరా చేస్తాం: కర్ణాటక

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ.. అక్కడి అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) సోమవారం స్పష్టం చేసింది. అంతేగాక, ఇకపై పాల ధరను కూడా లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది.

7.10 రోజుల గడువు ఇస్తే.. ఈ నివేదికా మీరు ఇచ్చేది..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరి ఘటన విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము ఆశించిన రీతిలో విచారణ లేదని వ్యాఖ్యానించింది. రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా స్పందించింది. 

8.అందుకే టీమ్‌ఇండియా పరిస్థితి ఇలా..: కపిల్‌ దేవ్‌

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడం బాధాకరమని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నారు. కొంతమంది ఆటగాళ్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే టీమ్‌ఇండియా పరిస్థితి ఇలా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేయాలని సూచించారు.

9.స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌.. EMIతో విమాన టిక్కెట్లు!

భారత్‌లో విమాన ప్రయాణం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలే. అధిక ఛార్జీలే అందుకు కారణం. అయితే, అలాంటి వారి కలలను నిజం చేయడం కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది.

10.అమెరికా లక్ష్యాలను ఛేదించేందుకు సాధన ఇలా..!

అమెరికా విమాన వాహక నౌకలు, ఇతర నావికాదళ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా సైన్యం సాధాన చేస్తోంది. ఇందు కోసం షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎడారిలో అచ్చం అమెరికా విమాన వాహక నౌకల వంటి నిర్మాణాలను చేపట్టింది. ఈ విషయం మాక్సర్‌ అనే సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. తమ యాంటీ క్యారియర్‌ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా ఇలా చేస్తోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని