Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 02 May 2022 21:01 IST

1. ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం... అంతర్జాలంలో హాల్‌టికెట్లు

తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్ష రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

2. గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.1,037కోట్లు విడుదల చేయాలని జగన్‌ ఆదేశం

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఉపాధి హామీపథకం, గ్రామీణ రహదారులు, తాగునీరు వంటి కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.1,037కోట్లకు వెంటనే పరిపాలన అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 9వేల కిలోమీటర్ల నిడివిగల రహదారులు మరమ్మతు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి అతి తర్వగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

3. బిట్‌కాయిన్లన్నీ అమ్మినా 25 డాలర్లు ఇవ్వను: వారెన్‌ బఫెట్‌

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఓవైపు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ఇప్పుడు అతిపెద్ద క్రిప్టోగా ఉన్న బిట్‌కాయిన్‌కు ఎంత ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ విలువ 38,712.75 డాలర్ల వద్ద చలిస్తోంది. దీని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 73.6 వేల కోట్ల డాలర్లు (సుమారు రూ.56.30 లక్షల కోట్లు)గా ఉంది.


Video: మనం సరిపడా నీటిని తాగుతున్నామా? తెలుసుకోవడం ఎలా?


4. విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. భీతిల్లిపోయిన ప్రయాణికులు.. వీడియో

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ బి737 విమానంలో నిన్న సాయంత్రం ప్రయాణించిన వారికి భయానక అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నగరానికి వెళ్తున్న విమానం వాతావరణ మార్పుల కారణంగా గాల్లో భారీగా కుదుపులకు (టర్బలెన్స్‌) లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

5. టీ20 లీగ్‌.. గత వారం అద్భుతాలివే.. వచ్చే వారం ప్రతి జట్టుకూ కీలకమే!

టీ20 లీగ్‌లోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ లక్ష్యాలను ఛేదించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొన్ని జట్లైతే స్వల్ప స్కోర్లను కాపాడుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పటి వరకు 46 లీగ్‌మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గత వారం (సోమవారం నుంచి ఆదివారం) తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. వాటి సంగతేంటో ఓసారి చూద్దాం.. అలానే ఇవాళ్టి నుంచి వచ్చే ఆదివారం వరకు మరో తొమ్మిది మ్యాచ్‌లు జరుగుతాయి.

6. కరెంటు సంక్షోభం వేళ.. విద్యుత్‌, నీటిని వివేకంతో వాడుకోండి!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే దాదాపు 35శాతం కరెంటు వినియోగం పెరిగింది. దీంతో డిమాండుకు సరిపడా విద్యుత్‌ను అందించలేక ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్‌ను వివేకంతో వాడుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచించారు. ముఖ్యంగా ఎయిర్‌ కండీషనర్లను అనవసరంగా వినియోగించకపోవడమే ఉత్తమమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

7. వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్‌.. చాట్‌ లిస్ట్‌లోనే స్టేటస్‌ అప్‌డేట్‌!

వాట్సాప్‌ స్టేటస్‌ గురించి మనందరికీ తెలిసిందే. స్టేటస్‌ ట్యాబ్‌లోకి వెళితే ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో తెలుసుకోవచ్చు. అయితే, ఆ ట్యాబ్‌లోకి వెళితే గానీ ఎవరెవరు ఏం పెట్టారో తెలిసే అవకాశం లేదు. అయితే, వాట్సాప్‌లో కొత్త సదుపాయం రాబోతోంది. ఇకపై మీరు చాట్‌ చేసిన వ్యక్తి స్టేటస్‌ పెడితే ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలో రాబోతోందని WABetaInfo పేర్కొంది.


Ukraine Crisis: మరియుపోల్‌లో ప్రజల ప్రత్యక్ష నరకం


8. స్మార్ట్‌ ఫీచర్లతో TVS కొత్త ఎన్‌టార్క్‌.. కాల్‌ అలర్ట్‌, క్రికెట్‌ స్కోర్‌..!

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టీవీఎస్‌  తన విజయవంతమైన ఎన్‌టార్క్‌ శ్రేణిలో మరో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. NTORQ 125 XT పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.03 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను పూర్తి స్థాయి టెక్‌ అడ్వాన్స్‌ ఫీచర్లతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

9. నల్ల సముద్రంలో రష్యాకు మరో దెబ్బ.. రెండు రాప్టర్‌ పడవలు ధ్వంసం

ఉక్రెయిన్‌ భూభాగంపైనే కాకుండా నల్ల సముద్రంలోనూ రష్యాకు కీవ్‌ బలగాల నుంచి చుక్కెదురవుతోంది. తాజాగా తమ డ్రోన్‌లు నల్ల సముద్రంలో రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్‌లను ధ్వంసం చేశాయని కీవ్‌ ప్రకటించింది. స్నేక్ ఐలాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రెండు రష్యన్ రాప్టర్ పడవలను నీటముంచినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. దీనికి సంబంధించిన ఏరియల్ వీడియో ఫుటేజీనీ విడుదల చేసింది.

10. ‘సర్కారువారి పాట’లో అసలు కథ అది కాదు..: పరశురామ్‌

‘గీత గోవిందం’ కంటే ముందే మహేశ్‌బాబు కోసం ‘సర్కారువారి పాట’ కథ రాశానని, అయితే అప్పుడు ఆయన్ను కలిసి కథ చెప్పాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయానని చెప్పుకొచ్చారు దర్శకుడు పరశురామ్‌. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని