CM Jagan: గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.1,037కోట్లు విడుదల చేయాలని జగన్‌ ఆదేశం

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఉపాధి హామీపథకం, గ్రామీణ రహదారులు, తాగునీరు వంటి కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో

Updated : 02 May 2022 19:08 IST

అమరావతి: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఉపాధి హామీపథకం, గ్రామీణ రహదారులు, తాగునీరు వంటి కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.1,037కోట్లకు వెంటనే పరిపాలన అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 9వేల కిలోమీటర్ల నిడివిగల రహదారులు మరమ్మతు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి అతి తర్వగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం ఉన్నట్టు తేలితే వెంటనే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనులు పూర్తి చేసి పెండింగ్‌లో ఉన్న రూ.800 కోట్లకు బిల్లులను వెంటనే విడుదల చేసి చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న రూ.1900 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించేలా  ఆర్థికశాఖకు సీఎం ఆదేశాలిచ్చారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు రూ.83 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. ఉపాధి హామీలో చెరువుల్లో పూడిక తీత పనులతో పాటు నీటి సామర్థ్యం పెంచేలా కాలువల తవ్వకానికి అనుమతించనున్నట్టు సీఎం వెల్లడించారు. స్వచ్ఛసంకల్పంపై పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే క్లియర్‌ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులన్నీ ప్రభుత్వమే ఇస్తుందని సీఎం తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13,245 బోర్లు వేశామని అధికారులు తెలిపారు. ఒక్కో బోరుకు కనీసం రూ.4.50లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు డీబీటీ విధానంలో రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని సీఎం ఆదేశించారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని, 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు కేవలం డ్రిల్లింగ్‌ మాత్రమే ఉచితంగా చేయాలన్నారు. జలకళలో ప్రతి రైతుకు యూనిట్‌కు సుమారు రూ.4 నుంచి 5లక్షల మేర ప్రభుత్వం సాయం చేస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని