Telangna news: యువత ఓటింగ్‌లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్‌ ఉపాధ్యాయ

విద్యా వంతులు, యువత ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్‌ ఉపాధ్యాయ అన్నారు.

Published : 04 May 2024 22:44 IST

హైదరాబాద్: విద్యా వంతులు, యువత ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా (WJI)  జాతీయ అధ్యక్షుడు సంజయ్‌ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, బలోపేతానికి ఓటర్లలో చైతన్యం అవసరమన్నారు. వారిని చైతన్య పరిచి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన ఎన్నికల సంఘం ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో WJI తెలంగాణ, పతంజలి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమానికి సంజయ్‌ ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడటమే కాకుండా ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఓటు వేయడం ఓ సంస్కృతిగా మారాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఓటర్ల సమస్యలనూ అర్థం చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తే.. ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనే వీలుంటుందన్నారు. అందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని, ముందుగా బోగస్ ఓట్లను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌ రావు, సీనియర్‌ పాత్రికేయులు వల్లీశ్వర్‌, ప్రొఫెసర్లు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, మురళీ మనోహర్‌, డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్‌, చీఫ్ అడ్వైజర్‌ నందనం కృపాకర్‌, యూజీసీ పూర్వ సభ్యుడు ప్రొఫెసర్‌ గోపాల్‌ రెడ్డి, అర్థనీతి ఫౌండేషన్‌ ఏపీ, తెలంగాణ ఇన్‌ఛార్జి లీల, విశ్వహిందూ పరిషత్‌ నేతలు వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌ దేశాయ్‌, కార్యదర్శి క్రాంతి కుమార్‌, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు ముఖ్యులు గోపాల కృష్ణ, రాజారెడ్డి, రామముని, దేవేందర్‌, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని