ఎన్నికలు: నవంబర్‌ నెల.. మంగళవారమే ఎందుకు?

అమెరికా ఎన్నికల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కాస్త ముందంజలో

Published : 06 Nov 2020 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా ఎన్నికల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కాస్త ముందంజలో ఉన్నా.. తుది ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల అభ్యర్థులు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ ఏకంగా తాము గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఓట్ల లెక్కింపుపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో తేలేలా లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ అగ్రరాజ్య ఎన్నికలంటే అందరికి ఆసక్తే. కానీ, ఈ ఎన్నికలు ప్రతిసారి నవంబర్‌ నెలలో.. అదికూడా తొలి మంగళవారం రోజునే ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? అయితే ఇది చదవండి..

ముందు ఇప్పటిలా కాదు..

అమెరికా ఎన్నికలకు 1845 ముందు వరకు ప్రస్తుతం ఉన్నట్లు ఎన్నికల తేదీ ఉండేది కాదు.. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్‌నెల మొదటి బుధవారం వరకు ఆయా రాష్ట్రాల్లో వీలును బట్టి ఎన్నికలు నిర్వహించేవారు. డిసెంబర్‌ మొదటి బుధవారం నాటికి అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసేవి. అయితే, ఈ విధానం వల్ల ఎవరు గెలవబోతున్నారో ముందే తెలిసే అవకాశముందని, ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని రాజకీయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లు. దీంతో దేశవ్యాప్తంగా ఒకేరోజున పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అలా 1845లో అప్పటి ప్రభుత్వం నవంబర్‌ నెలలో తొలి సోమవారం తర్వాత వచ్చే తొలి మంగళవారాన్ని పోలింగ్‌ నిర్వహించే రోజుగా ప్రకటించింది. అప్పటి నుంచి ఏ ఎన్నికలు చూసుకున్నా.. నవంబర్‌ 2 నుంచి నవంబర్‌ 8 మధ్య పోలింగ్‌ జరుగుతూ వస్తోంది. దీనికి కారణం అప్పటి రైతులే.

ఆ నెలనే ఎందుకు?

19వ శతాబ్దంలో అమెరికాలో ఎక్కువగా రైతులే ఉండేవారు. మారుమూల గ్రామాల్లో జీవనం కొనసాగించే రైతులు ఓటు వేయాలంటే పెద్ద సమస్యే తలెత్తేది.  ఓటు వేయడం కోసం రైతులు కనీసం ఒక రోజంతా ప్రయాణం చేసి పోలింగ్‌ కేంద్రానికి రావాలి. దీంతో ఓటర్ల కోసం అధికారులు రెండ్రోజులపాటు పోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చేది. దీనికి పరిష్కారంగా, అందరికి ఆమోదయోగ్యంగా నవంబర్‌ నెల మొదటి మంగళవారాన్ని ఎంచుకున్నారు. ఎన్నికలు మార్చి-జూన్‌ మధ్య నిర్వహిద్దామంటే రైతులు పంటలు వేసే సమయం. అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రైతులు ఓట్లు వేసే అవకాశం లేదు. జులై - అక్టోబర్‌ మధ్య నిర్వహించాలనుకుంటే రైతులకు పంటకోత కాలం.. అప్పుడూ రైతులు ఓట్లు వేయలేరు. దీంతో నవంబర్‌ నెల సరైందని నిర్ణయించుకున్నారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగితే.. ఆ నెలతోపాటు డిసెంబర్‌ నెలలో ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలు పూర్తయి.. ఎంపికైన అధ్యక్షుడు జనవరి నెలలో బాధ్యతలు తీసుకోవచ్చని యోచించారు. 

మంగళవారానికి ఉన్న ప్రాధాన్యతేంటి?

పోలింగ్‌ రోజు నవంబర్‌ తొలి మంగళవారమే ఎందుకంటే.. శుక్ర, శనివారాలు వారాంతం కావడంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు. ఆదివారం ప్రజలంతా చర్చిలో ప్రార్థనలు చేసి, సరదాగా గడుపుతారు.. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమనుకున్నారు. బుధవారం రైతులు పండించిన పంటలను మార్కెట్లలో విక్రయిస్తారు. వారికి వ్యాపారం జరిగే రోజు కాబట్టి ఓట్లు వేయడానికి రారు. ఇక మిగిలిన సోమ, మంగళ, గురువారాల్లో ప్రభుత్వం మంగళవారాన్ని ఎంచుకుంది. ఆ రోజున ఎన్నికలు నిర్వహిస్తే.. రైతులు ఆదివారం దైవ ప్రార్థనలు పూర్తి చేసుకొని పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరొచ్చు. సోమవారం రాత్రి వరకు వారి స్థానిక పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని మంగళవారం ఓటు వేసి తిరుగుపయనమయితే.. బుధవారం మళ్లీ వారి వ్యాపారం చేసుకునే వీలు ఉంటుంది. అందుకే నవంబర్‌ నెల తొలి మంగళవారాన్ని పోలింగ్‌ తేదీగా చట్టం చేశారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యోగాలు, ప్రజారవాణాలో ఎన్నో మార్పులు వచ్చినా ఇప్పటికీ అదే రోజున పోలింగ్‌ నిర్వహించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు