Corona: బలిపీఠంపై గురువు!

నవసమాజ నిర్మాతపై కొవిడ్ పిడుగు పడింది. బాలలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే ఉపాధ్యాయులను కొవిడ్ కమ్మేసింది. కర్ణాటకలో జరిగిన విషాదకర ఘటనే ఇందుకు సాక్షాత్కారంగా నిలుస్తోంది...

Updated : 21 Dec 2022 15:34 IST

ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1,673 మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవసమాజ నిర్మాతపై కొవిడ్ పిడుగు పడింది. బాలలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే ఉపాధ్యాయులను కొవిడ్ కమ్మేసింది. కర్ణాటకలో జరిగిన విషాదకర ఘటనే ఇందుకు సాక్షాత్కారంగా నిలుస్తోంది. కర్ణాటకలో ఎన్నికల విధులు నిర్వర్తించిన 52 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడి మరణించారు. అటు యూపీలో 1,621 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరంతా ఎన్నికల సందర్భంగానే కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలోని బసవకళ్యాణ్‌ నియోజకవర్గానికి, బీదర్ మున్సిపాలిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 మధ్య ఈ ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 1,434 మంది బోధన, బోధనేతర సిబ్బందిని విధి నిర్వహణ కోసం ఎంపిక చేశారు అధికారులు. ఈ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందిలో 52 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఎంపిక చేసిన సిబ్బందికి ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్​గా తేలిన 67 మందిని విధులకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మరణించిన ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో 26 మంది ఉపాధ్యాయులు కరోనాతో పోరాడుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. సమాజ నిర్మాతలుగా చెప్పుకునే ఉపాధ్యాయుల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వాపోయాయి. ఏ రాజకీయ పార్టీ కూడా వీటి గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై స్పందించిన బీదర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్​స్ట్రక్షన్ టీఆర్ దొడ్డే.. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే ఎన్నికలను నిర్వహించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వైరస్ ఎలా సోకిందో తేలాల్సి ఉందని చెప్పారు.

యూపీలో 1,621 మంది బలి!
మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో చాలా మంది కరోనాతో మరణించారని ఉత్తర్​ప్రదేశ్ ప్రాథమిక శిక్షక్ సంఘ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.ఏప్రిల్ తొలి వారం నుంచి మే 16 వరకు ఉత్తర్​ప్రదేశ్​లో ఏకంగా 1,621 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సంఘ్ వెల్లడించింది. ఇందులో 90శాతానికి పైగా మరణాలు పంచాయతీ ఎన్నికలకు హాజరైన సిబ్బందివేనని కుండబద్దలు కొట్టింది. అయితే, యోగి సర్కారు మాత్రం ఈ నివేదికలను పూర్తిగా తప్పుపట్టింది. ముగ్గురంటే ముగ్గురు ఉపాధ్యాయులే కరోనాతో మరణించారని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని