Bipin Rawat: ఏమిటీ 17 గన్‌ సెల్యూట్‌..?

సీడీసీ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో 17తుపాకుల వందనం సమర్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అసలు తుపాకులతో వందనం

Updated : 10 Dec 2021 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సీడీసీ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో 17 గన్‌ సెల్యూట్‌ను సమర్పించారు. అసలు తుపాకులు/శతఘ్నులతో వందనం సమర్పించడం ఏమిటి? ఈ విధానం ఎందుకు పాటిస్తారు? ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? రావత్‌కు 17 గన్‌ సెల్యూట్‌ వందనం దేనికో తెలుసా..? 

భారత్‌లో స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం సందర్భంగా 21 తుపాకులతో త్రివర్ణ పతాకానికి వందనం సమర్పిస్తుంటారు. ఇది ఒక రకమైన సైనిక వందనం. 16వ శతాబ్ధంలో బ్రిటన్‌ నావికాదళం దీనిని ప్రారంభించింది. ఇందుకు శతఘ్నులు లేదా తుపాకులను వాడవచ్చు. ఈ తుపాకుల వందనాన్ని వివిధ వ్యక్తులకు, వివిధ సందర్భాల్లో వారి గౌరవార్థం ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొందిన కామన్‌వెల్త్‌ దేశాల్లో ఇది కనిపిస్తుంది. సాధారణంగా దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటిల్లో సందర్భానికి అనుగుణంగా 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనాలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, అత్యంత సీనియర్‌ సైనికాధికారులకు 21 తుపాకుల వందనం ఇస్తారు.  త్రివిధ దళాధిపతులకు 17 గన్‌ సెల్యూట్‌ సమర్పిస్తారు.

ప్రస్తుత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఫోర్‌స్టార్‌ జనరల్‌. ఆయన ఆర్మీ చీఫ్‌, నేవీ చీఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌తో సమానమైన ర్యాంక్‌. కానీ, వీరందరిలో ప్రథముడిగా వ్యవహరిస్తున్నారు. అందుకే 17గన్‌ సెల్యూట్‌ ఆయనకు సమర్పించారు. దీనికి 2233 ఫీల్డ్‌ రెజిమెంట్‌ నుంచి ఇవి వచ్చాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాకు సమానమైన ఆరుగురు అధికారులు ఫ్లాగ్‌ బేరర్లుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని త్రివిధ దళాల్లోని అత్యంత సీనియర్లైన 800 మంది అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని