కిసాన్‌ సంఘర్ష్‌ సమితికి ఆంధ్ర రైతుల సాయం

నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ప్రాంతంలో ఆందోళన కొనసాగిస్తున్న ఆల్ ఇండియా కిసాన్

Updated : 27 Dec 2020 14:55 IST

దిల్లీ : నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ప్రాంతంలో ఆందోళన కొనసాగిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(AIKSCC)కి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి రూ.5 లక్షల సహాయాన్ని అందించింది. 

భారతీయ కిసాన్ యూనియన్ నాయకులకు మరో రూ.5 లక్షలు సహాయం అందిస్తామని వెల్లడించింది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల బృందం దిల్లీ చేరుకుంది. ఏపీ భవన్‌ నుంచి సింఘు సరిహద్దు వరకూ రైతు సంఘాల నేతలు ర్యాలీగా బయలు దేరారు.

‘మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండా వీటిని తీసుకొచ్చింది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. మోదీ ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు.. అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కరోనా తీవ్రంగా ఉన్న సమయాన్ని ఆసరా చేసుకుని.. ప్రజలు బయటకు రాని సందర్భంలో కొత్త చట్టాలు తీసుకువచ్చింది. కార్పొరేట్‌లకు లబ్ధి జరిగేలా వ్యవహరించారు. ఇప్పుడు మోదీ, భాజపా నేతలు చెబుతున్న విధంగా.. బిహార్‌లో కనీస మద్దతు ధర ఎందుకు అమలు కావడం లేదు? అక్కడ ఉన్నది భాజపా మద్దతు ప్రభుత్వమేగా? అయినా అక్కడి రైతులు ఎందుకు నష్టపోతున్నారు? చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలి. అందుకు పూర్తి మద్దతుగా నిలబడతాం. నా స్నేహితుల నుంచి సేకరించిన రు.10 లక్షల విరాళాన్ని రైతుల ఉద్యమాన్ని నడిపిస్తున్న కిసాన్ సంఘర్ష్‌ సమితికి అందిస్తున్నా’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని