ప్రణబ్‌ ముఖర్జీ మాకు రక్షకుడిగా నిలిచారు..

ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో తాము ఓ ప్రియ మిత్రుని కోల్పోయామని పొరుగుదేశం బంగ్లాదేశ్‌ ప్రకటించింది.

Published : 01 Sep 2020 16:36 IST

బుధవారం సంతాపదినంగా పాటించనున్న బంగ్లాదేశ్‌

ఢాకా: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో తాము ఓ ప్రియ మిత్రుని కోల్పోయామని పొరుగుదేశం బంగ్లాదేశ్‌ ప్రకటించింది. ఆయన మృతికి నివాళిగా తమ దేశంలో బుధవారం సంతాప దినంగా పాటిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా బుధవారం బంగ్లాదేశ్‌లో జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో.. ప్రణబ్‌ దాతో తమ దేశానికి గల దశాబ్దాల అనుబంధాన్ని ఆమె స్మరించుకున్నారు. ఆయన దక్షణాసియాలో అత్యంత గౌరవనీయులైన నేత అని హసీనా వెల్లడించారు. ఆయన నిరంతర కృషి భారత్‌లోనే కాకుండా, దక్షణాసియా ప్రాంతంలోని భావి తరాల నేతలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనను తమ దేశ ప్రజలు అమితంగా ప్రేమించి గౌరవిస్తారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
‘‘ఓ రాజకీయ నాయకునిగా, మంచి స్నేహితునిగా బంగ్లాదేశ్‌ విమోచన పోరాటంలో ప్రణబ్‌ ముఖర్జీ అసమాన సహకారం మరువలేనిది. ఆయన అసమాన సేవలను మా దేశం ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుంది. ఆగస్టు 15, 1975లో బంగ్లాదేశ్‌ జాతిపిత ‘బంగబంధు’ షేక్‌ ముజిబూర్‌ రెహమాన్‌ హత్యానంతరం, ప్రణబ్‌ ముఖర్జీ మాకు భారత్‌లో ఆశ్రయం కల్పించి సహాయ పడ్డారు. మా సోదరి షేక్‌ రహానాతో సహా మా కుటుంబానికి అండగా నిలిచారు. మా దేశం తిరిగి వచ్చిన అనంతరం కూడా ఆయన బంగ్లాతో అనుబంధాన్ని కొనసాగించారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రతి కష్టంలోను మాకు రక్షకుడిగా, కుటుంబ మిత్రునిగా నిలిచారు. ఆయన మరణంతో భారత్‌ ఓ సమర్ధుడైన రాజకీయ నాయకుడిని పోగొట్టుకోగా... బంగ్లాదేశ్‌ ఓ ప్రియ మిత్రుడిని కోల్పోయింది. ఆయన భారత రాజకీయాకాశంలో ధృవతారగా నిలుస్తారు.’’ అని షేక్ హసీనా పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
1971 నాటి బంగ్లాదేశ్‌ విమోచన సందర్భంగా ప్రణబ్‌ అందించిన అమూల్య సహకారానికి గాను.. ఆయనకు 2013లో ‘బంగ్లాదేశ్‌ ముక్తిజుద్ధో సొమ్మానోనా’ పురస్కారాన్ని ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని