దిగొస్తున్న చైనా?

మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు............

Published : 04 Sep 2020 10:49 IST

ఉద్రిక్తతల నడుమ చర్చలకు ప్రతిపాదన

మాస్కో(రష్యా): మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత దౌత్యాధికారులకు చైనా ప్రతినిధులు సమాచారం అందజేశారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రతిపాదనపై ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కానీ, ఫెంఝీతో సమావేశానికి కేంద్రం అనుమతించినట్లు అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్‌-చైనా సరిహద్దు వివాదాలు కేవలం దౌత్యపరంగానే పరిష్కారమవుతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన రావడం గమనార్హం.  

గత నెల 29 అర్ధరాత్రి పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్‌ విఫలయత్నం చేయడంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భారత్‌ చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఆ ఫింగర్‌ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. సైన్యం అంచనాల ప్రకారం భారత్‌ వ్యూహాత్మక ఎత్తులు ఫలిస్తునట్లు అర్థమవుతోంది. అందుకే చర్చలకు ముందుగానే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని