దిల్లీలో కరోనా ‘థర్డ్‌ వేవ్‌’ కనిపిస్తోంది: కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ కనిపిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దీంతో ప్రభుత్వం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోందని చెప్పారు. ఈ మేరకు ఆయన హిరాంకీ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.

Published : 05 Nov 2020 00:59 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ కనిపిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దీంతో ప్రభుత్వం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోందని చెప్పారు. ఈ మేరకు ఆయన హిరాంకీ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ‘రాజధానిలో కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం అన్ని విధాలా సమాయాత్తమవుతోంది. పండగ సీజన్‌, దాంతో పాటు శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దీపావళికి టపాకాయలు కాల్చాలా వద్దా అనే విషయమై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.  దీనికి సంబంధించి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నాం. ఆస్పత్రుల్లో పడకలు, ఇతర సౌకర్యాలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమాయాత్తమవుతున్నారు. కరోనా రోగుల కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 80శాతం బెడ్లు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాం’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ.. పంట వ్యర్థాల దహనానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వం పరిష్కారం కనుక్కుందని కేజ్రీవాల్‌ తెలిపారు. పంటవ్యర్థాలను తగలబెట్టకుండా డికంపోజ్‌ చేసేందుకు ‘పూస బయోడికంపోజర్‌’ మంచి ఫలితాల్ని ఇస్తోందని ఆయన వెల్లడించారు. దీని ప్రాధాన్యతను సుప్రీంకోర్టుకు వివరిస్తామని పేర్కొన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు 80శాతం బెడ్లు కేటాయించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అది వ్యక్తుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. కాగా దిల్లీలో  మంగళ, బుధవారాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. బుధవారం అత్యధికంగా 6,842 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 83లక్షల కేసులు నమోదు కాగా.. 1.24లక్షల మంది మహమ్మారి కారణంగా మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని