మిగ్‌-29కే ప్రమాదం: పైలట్‌ మృతదేహం లభ్యం

భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్‌ మృతదేహం లభ్యమైంది.

Published : 08 Dec 2020 02:10 IST

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్‌ మృతదేహం లభ్యమైంది. రెండువారాల క్రితం జరిగిన ఆ దుర్ఘటన నుంచి ఒక పైలట్‌ ప్రాణాలతో బయటపడగా మరో పైలట్‌ నిషాంత్‌ సింగ్‌ గల్లంతైన విషయం తెలిసిందే. తాజాగా పైలట్‌ నిషాంత్‌ మృతదేహాన్ని గోవాకు 30మైళ్ల దూరంలో నావికా దళాలు కనుగొన్నాయి. ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా ముమ్మర గాలింపు చేపట్టిన నౌకాదళాలకు, సముద్రంలో 70మీటర్ల లోతులో నిషాంత్‌ మృతదేహం కనిపించినట్లు సమాచారం. ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం(నవంబర్‌ 29న) మిగ్-29కి చెందిన కొన్ని శిథిలాలు లభ్యమయినప్పటికీ నిషాంత్‌ ఆచూకీ తెలియలేదు. అయినప్పటికీ ఆయన సురక్షితంగానే ఉంటారనే ఆశతో అందరూ ఎదురుచూశారు. కానీ,  చివరకు అది విషాదాన్నే మిగిల్చింది. నిషాంత్‌ మృతదేహం లభ్యమైన విషయాన్ని పైలట్‌ కుటుంబ సభ్యులకు తెలియజేసిన అధికారులు, నిర్ధారించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్ష జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.

భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం నవంబర్‌ చివరి వారంలో సముద్రంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఒక పైలట్‌ను కాపాడగలిగారు. గల్లంతైన మరో పైలట్ నిషాంత్‌ సింగ్ కోసం దాదాపు తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలతో పాటు ప్రత్యేక సాంకేతికను వినియోగించిన అధికారులు, గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించి తీవ్రగాలింపు చేపట్టింది. చివరకు రెండువారాల అనంతరం పైలట్‌ మృతదేహం లభ్యమైంది.

ఇదిలాఉంటే,  ఏడాది కాలంలో మిగ్‌-29కే విమానం ప్రమాదానికి గురవడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో పక్షులు ఢీకొట్టడంతో మిగ్‌-29కే విమానం కూలిపోయింది. ఆ ఘటనలో మాత్రం ఇద్దరు పైలట్‌లు సురక్షితంగానే బయటపడ్డారు. గతేడాది నవంబరులో సాంకేతికలోపం కారణంగా మిగ్‌ కూలిపోయింది. భారత నౌకాదళానికి 40కి పైగా మిగ్‌-29కే యుద్ధ విమానాలున్నాయి. గోవా నేవీ బేస్‌, ఐఎన్ఎస్‌ విక్రమాదిత్య నుంచి వీటిని నిర్వహిస్తుంటారు.

ఇవీ చదవండి..
ఫైటర్‌ పైలట్‌ విలువ తెలుసా..?
చైనా తిమింగలాల వేట ఇలా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని