బిహార్‌ ఎన్నికలు: 160టన్నుల బయో వ్యర్థాలు!

బిహార్‌లో ఎన్నికల్లో భాగంగా దాదాపు దాదాపు 160 టన్నుల బయోమెడికల్‌ వేస్ట్‌ (జీవ వ్యర్థాలు) సేకరించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Published : 16 Nov 2020 01:14 IST

బయోమెడికల్‌ వ్యర్థాలను సేకరించిన అధికారులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో బిహార్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను సజావుగా నిర్వహించగలిగింది. అయితే నిర్వహణలో భాగంగా కొవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరి చేసి అమలుపరిచింది. ఇందుకోసం భారీస్థాయిలో మాస్కులు, చేతి గ్లౌజులు, శానిటైజర్‌ బాటిళ్లని అందుబాటులో ఉంచింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత, దాదాపు 160 టన్నుల బయోమెడికల్‌ వేస్ట్‌ (జీవ వ్యర్థాలు) సేకరించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 18లక్షల ఫేస్‌ షీల్డ్‌లు, 70లక్షల మాస్కులు, ఒకేసారి వినియోగించే 5.4లక్షల చేతి గ్లౌజులతోపాటు 7.21కోట్ల పాలిథిన్‌ గ్లౌజులను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా 100 నుంచి 500మి.లీ సామర్థ్యం కలిగిన 29లక్షల హ్యాండ్‌ శానిటైజర్‌ బాటిళ్లను కొనుగోలు చేసింది. ఎన్నికలు ముగిసిన అనంతరం వీటిని సేకరించగా..దాదాపు 160టన్నుల వ్యర్థాలు పోగైనట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటిని ప్రత్యేకంగా శుద్ధిచేసిన అనంతరం నిర్వీర్య కేంద్రాలకు పంపించామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా ఎన్నికల ముందురోజు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను శానిటైజ్‌ చేయడంతోపాటు పోలింగ్‌ రోజు మూడుసార్లు శానిటైజ్‌ చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇదిలాఉంటే, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ఎంతో దోహదపడిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. జీపీఎస్‌ సహాయంతో రూపొందించిన ఈ యాప్‌తో ఈవీఎం మిషన్లను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించే పోలిసు సిబ్బంది ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఈవీఎం మిషన్లు సజావుగా కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగామని ఎన్నికల అధికారులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని