ఆ రెండు దేశాల నుంచే ఎక్కువ కేసులు!

భారత్‌లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో వైరస్‌ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 27 Sep 2020 18:21 IST

దిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో వైరస్‌ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా దుబాయ్‌, యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఐఐటీ-మండీ విశ్లేషణాత్మక అధ్యయనం పేర్కొంది. ట్రావెల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ఈ తాజా అధ్యయనం ప్రచురితమైంది.

విదేశాల నుంచి భారత్‌కు వైరస్‌ ఎలా వ్యాపించింది? అనే విషయంపై హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐఐటీ-మండీ పరిశోధకులు దృష్టిపెట్టారు. తద్వారా భారత్‌లో వైరస్‌ వ్యాప్తికి ముఖ్యకారణమైన కొందరు సూపర్‌ స్ప్రెడర్‌లను గుర్తించారు. రోగుల ప్రయాణచరిత్ర ఆధారంగా వారిని ధృవీకరించుకున్నారు. ఇలా ఆ రెండు దేశాలనుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు వచ్చాయని..అనంతరం దేశంలోకి ప్రవేశించిన తర్వాత స్థానికంగా వైరస్‌ వ్యాప్తి ఎక్కువైనట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సరితా ఆజాద్‌ వెల్లడించారు.

వైరస్‌ సోకిన వారి జనవరి నుంచి ఏప్రిల్‌ ప్రయాణ చరిత్రను పరిశోధనా బృందం సేకరించింది. దీని ఆధారంగా వైరస్‌ గురించిన పూర్తి వివరాలతో సోషల్‌ నెట్వర్క్‌ను ఏర్పాటుచేశారు. వీరిలో ఎక్కువగా దుబాయ్‌(144), యూకే(64) నుంచి వచ్చినవారే ఉన్నట్లు పరిశోధనలో తేలిందని సరితా వెల్లడించారు. భారత్‌లో వైరస్‌ వ్యాప్తికి ఈ రెండు దేశాలనుంచి వచ్చిన వారే కీలకంగా వ్యవహరించినట్లు ఆమె స్పష్టంచేశారు.

అయితే, వివిధ రాష్ట్రాల్లో వేరువేరు సమూహాలుగా వైరస్‌ వ్యాపించింది. మార్చి 25నుంచి ఏప్రిల్‌ 14వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా నమోదైంది. ముఖ్యంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. ఈ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వైరస్‌ వ్యాపించినట్లు వెల్లడైంది. అయితే, తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల నుంచి వైరస్‌ ఇతర రాష్ట్రాలకు సోకడంలో తక్కువ పాత్ర పోషించాయని పరిశోధనా బృందం పేర్కొంది. భారత్‌లో ఈ మహమ్మారి ప్రారంభ దశలో వైరస్‌వ్యాప్తి ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు తాజా పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుందని సరితా ఆజాద్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరింది. వీరిలో 94వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని