వచ్చే ఏడాదికి భారత్‌లో వ్యాక్సిన్‌, కానీ..

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదికి భారత్‌లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్‌దీప్ కాంగ్‌ అన్నారు.

Published : 22 Sep 2020 12:31 IST

వాటి విజయావకాశం 50 శాతమే!

 

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదికి భారత్‌లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్‌దీప్ కాంగ్‌ అన్నారు. కాకపోతే 130 కోట్ల మంది భారతీయులకు దాన్ని అందజేయడం అతి పెద్ద సవాలని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ అడ్వైజరీ కమిటీలో సభ్యురాలు, వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన గగన్‌దీప్ ఓ మీడియా సంస్థతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రయోగదశల్లో ఉన్న వ్యాక్సిన్ల సమర్థత ఈ ఏడాది చివరికల్లా తేలిపోతుంది. మంచి ఫలితాలు సాధిస్తే..2021 ప్రారంభానికి కొద్ది సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయి. పెద్ద సంఖ్యలో కావాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మూడో దశ ప్రయోగ స్థాయిలో ఉన్న వ్యాక్సిన్లు విజయవంతం అయ్యే అవకాశం 50 శాతం మాత్రమే’ అని వాస్తవ పరిస్థితులను వివరించారు. 

ప్రయోగాలు ముగించుకొని వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరవాత దాని నిల్వ, పంపిణీ భారత దేశంలో అతి పెద్ద అడ్డంకిగా ఉందని ఆమె వెల్లడించారు. ‘కరోనా కారణంగా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న వృద్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు సరైన వ్యవస్థ లేదు. అన్ని వయస్కుల వారికి రోగనిరోధక శక్తిని ఇచ్చేలా ఒక వ్యవస్థను నిర్మించడం ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాలు’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా..భారత్ పూర్తి స్థాయిలో సరైన ఫలితాలు ఇవ్వని రాపిడ్ యాంటిజెన్ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని  వెల్లడించారు. రోజూవారీగా నిర్వహించేది యాంటిజెన్‌ లేక ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలా అనే విషయాన్ని డేటాలో ప్రస్తావించట్లేదని,  అలాగే లక్షణాలు కనిపించిన వ్యక్తులు లేక లేని వారిపై నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయట్లేదన్నారు. దేశంలో యాంటిజెన్‌ పరీక్షల సంఖ్యను పెంచినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను నియంత్రించడానికి విధించిన ఐదు శాతం బెంచ్‌మార్క్‌ కంటే భారత్‌లో వైరస్‌ పాజిటివిటీ  ఎనిమిది శాతంగా ఉండటం ఆందోళనకర పరిణామమన్నారు. వివిధ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే విధానమేంటో తెలియకపోతే వైరస్‌ వేగవంతం అవుతుందో లేదో చెప్పడం కష్టమని ఆమె వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని