యువతకూ ముప్పే..! WHO హెచ్చరిక

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో యువతకూ ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది.

Updated : 31 Jul 2020 11:49 IST

వైరస్‌కు యువత అతీతం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచన

జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో యువతకూ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. యువకులు ఈ వైరస్‌కు అతీతం కాదని పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని ఇదేవరకే స్పష్టం చేశామని, అయినప్పటికీ మరోసారి హెచ్చరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ స్పష్టం చేశారు. ఈ వైరస్‌తో వృద్ధులకు తీవ్ర ముప్పు ఉన్నట్లుగానే యువతకూ ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

‘యువకులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది, కరోనా బారినపడిన యువకులు కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. వీరి నుంచి వైరస్‌ మరొకరికి సోకే ప్రమాదం ఉంది’ అని అధోనామ్‌ అన్నారు. అందుకే మిగతావారిలాగే యువకులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తద్వారా వారిని వారు రక్షించుకోవడంతోపాటు ఇతరులను కూడా రక్షించడం వీలవుతుందన్నారు. కొన్నిదేశాల్లో ఆంక్షల సడలింపులతో యువత విహారయాత్రలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో యువతదే కీలకపాత్ర అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ మరోసారి నొక్కిచెప్పారు. పలుదేశాల్లో రెండో దఫా వైరస్‌ విజృంభిస్తోన్న తీరును టెడ్రోస్‌ గుర్తుచేశారు. అలసత్యం వహిస్తే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉందని తేల్చిచెప్పారు. మహమ్మరిని ఎదుర్కొవడంలో ముందుండి ఎన్నో ప్రాణాలను రక్షిస్తోన్న యోధులకు, ఆరోగ్య సిబ్బందికి సెల్యూట్‌ అంటూ వారి సేవలను టెడ్రోస్‌ కొనియాడారు.

చాలా సందర్భాల్లో ఈ వ్యాధి సోకినవారిలో స్పల్ప లక్షణాలే కనిపించవచ్చు. కానీ ఇది శరీరంలోని మరిన్ని అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో వీటి పర్యవసానాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రమాదం బారినపడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని సూచించారు. విజ్ఞతతో ఆలోచించి జాగ్రత్త పడాలని మైక్‌ రేయాన్‌ యువతకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

‘ప్రస్తుతం యువకుల్లో చాలా మందిలో తక్కువ లక్షణాలే కనిపిస్తున్నాయి. కానీ, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారిలో కూడా వ్యాధి తీవ్రతరం కావచ్చు. ఐసీయూల్లో చికిత్స తీసుకునే అవసరం రావచ్చు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ఆస్కారం కూడా ఉంది’ ఉని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ నిపుణురాలు మారియా వాన్‌ కెర్కోవ్‌ హెచ్చరించారు.

ఇవీ చదవండి..
భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదు..!
సరైన వెంటిలేషన్‌ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని