AAP: ఉమ్మడి పౌరస్మృతికి ఆమ్‌ఆద్మీ మద్దతు.. కానీ.. ఓ షరతు..!

యూనిఫాం సివిల్‌ కోడ్‌కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించింది.

Published : 28 Jun 2023 18:46 IST

దిల్లీ: వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలంటూ ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించింది. కానీ, అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలని పేర్కొంది.

‘ఉమ్మడి పౌరస్మృతికి ఆమ్‌ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపుతోంది. ఆర్టికల్‌ 44 అదే విషయాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నాం. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలతోపాటు అన్ని భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే యూనిఫాం సివిల్‌ కోడ్‌ (UCC)ని అమలు చేయాలి’ అని ఆమ్ఆద్మీ పార్టీ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాఠక్‌ వెల్లడించారు.

మరోవైపు ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల భవితవ్యంతో ఆడుకుంటున్నాయని అన్నారు. వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలన్న ఆయన.. ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనల అమలు సాధ్యమేనా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ.. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోందని ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని