Arvind Kejriwal: విద్యపైనే మా రాజకీయాలు.. భాజపా, కాంగ్రెస్‌లపై మండిపడ్డ కేజ్రీవాల్‌

భాజపా, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న సమయంలో విద్య గురించి అసలు నోరు విప్పలేదని.. కానీ, తమ రాజకీయాలు మాత్రం విద్యపైనే ఆధారపడి ఉంటాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొన్నారు.

Published : 12 Jun 2023 15:40 IST

దిల్లీ: భాజపా, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న సమయంలో విద్య గురించి అసలు నోరు విప్పలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆరోపించారు. కానీ, తమ పార్టీ రాజకీయాలు మాత్రం కేవలం పిల్లల విద్యపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. పశ్చిమ దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఓ పాఠశాల కొత్త భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రెండు పార్టీల తీరుపై మండిపడ్డారు.

‘ఈ పాఠశాలను 1985లో నిర్మించారు. తర్వాత భాజపా, కాంగ్రెస్‌లు అధికారంలోకి వచ్చాయి. కానీ, వారి అజెండాలో మాత్రం విద్య లేదు. విద్య గురించి ఆ రెండు పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదు. మా రాజకీయాలు మాత్రం చిన్నారులకు అందించే విద్యపైనే ఉంటాయి. కేవలం చిన్నారులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఉద్దేశం. మెరుగైన విద్యను అందించడంతోపాటు విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే ఆ భగవంతుడు మాకు అధికారం ఇచ్చి ఉంటాడు’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లోనూ గతంలో అభద్రతా భావన ఉండేదని.. కానీ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఈ క్రమంలో పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరగుపరిచేందుకు కృషి చేస్తున్నామని.. మరికొన్ని పాఠశాలలు మార్చాల్సి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని స్కూళ్లన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

భాజపా కార్యకర్తల్లోనూ వ్యతిరేకత

కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను భాజపా కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకిస్తూ ఆప్‌ నిర్వహించిన మహాసభకు భాజపా మద్దతుదారులు కూడా హాజరయ్యారని అన్నారు. ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి మోదీ తప్పిదం చేశారని భాజపా నేతలే ఉంటున్నారని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని