Anand Mahindra: మమ్మల్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.. ఆనంద్‌ మహీంద్రాకు పిల్లాడి విజ్ఞప్తి!

నేటితరం పిల్లలు తల్లిదండ్రులను ఏవిధంగా ప్రేరేపిస్తున్నారనే దానికి ఉదాహరణగా ఆనంద్‌ మహీంద్రా వీడియోను షేర్‌ చేశారు.

Published : 06 Mar 2024 18:28 IST

ముంబయి: తరాలు మారేకొద్దీ మనిషి అభిప్రాయాలు, ఆలోచనలు మారుతుంటాయి. గతంలో ఇంట్లో తల్లిదండ్రుల మాటకు పిల్లలు ఎదురుచెప్పేవారు కాదు. తర్వాతి తరంలో తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేవాళ్లు. కానీ, ప్రస్తుతం తరంలో యువతతోపాటు పిల్లలు సైతం తమ వైఖరిని తెలియజేయడమే కాక, కీలక నిర్ణయాల్లో తమను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)సైతం నేటితరం పిల్లల గురించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

వికాస్‌ గార్గ్‌ అనే వ్యక్తి కారు కొనేందుకు మహీంద్రా షోరూమ్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతని కొడుకు అద్వైత్‌ కారు కొనే విషయంలో పిల్లల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పెద్దలతోపాటు తమకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు. ఈ వీడియోను వికాస్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ఆనంద్‌ మహీంద్రాకు ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఆయన.. ‘‘మీరు చెప్పింది నిజమే వికాస్‌. కుటుంబం ఏ కారు కొనుగోలు చేయాలనే విషయంలో పిల్లల అభిప్రాయం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అద్వైత్‌ చెప్పింది కూడా సరైందే. మా షోరూమ్‌లలో పిల్లలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వం. అద్వైత్‌ మెసేజ్‌ తన వయసు వారి గురించి మా టీమ్‌ను ఆలోచించేలా చేసింది. కచ్చితంగా అతడి సూచనను పరిగణలోకి తీసుకుంటాం’’ అని ఆనంద్‌ మహీంద్రా బదులిచ్చారు. ఇది చూసిన నెటిజన్లు పలు నగరాల్లోని మహీంద్రా షోరూమ్‌లలో తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని