Army Chopper: నదిలో కుప్పకూలిన ధ్రువ్‌.. రెండు నెలల్లో రెండో ఘటన

Helicopter Crash: ఆర్మీ హెలికాప్టర్‌ ఒకటి ప్రమాదవశాత్తూ జమ్మూకశ్మీర్‌లోని ఓ నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.

Updated : 04 May 2023 15:57 IST

శ్రీనగర్‌: భారత సైన్యానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌ (Army Helicopter) ప్రమాదానికి గురైంది. ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ (ALH Dhruv Helicopters) ఛాపర్‌ గురువారం జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కిష్త్వార్‌ జిల్లాలో కుప్పకూలింది. మార్వా అటవీ ప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పైలట్, కో పైలట్‌కు గాయాలవ్వగా... వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించినట్లు అంతకుముందు అధికారులు వెల్లడించారు. దీంతో మూడో వ్యక్తి గురించి స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఘటన (Helicopter Crash)పై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

మార్చి 8న కూడా...

కాగా.. ధ్రువ్‌ హెలికాప్టర్లు (ALH Dhruv helicopters ) ప్రమాదాలకు గురవడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌.. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. గత సోమవారం నుంచే వీటి సేవలను పునరుద్ధరించారు. ఈ క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మార్చి 16న అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైన్యానికి చెందిన ఏవియేషన్‌ చీతా హెలికాప్టర్‌ రోజువారీ శిక్షణలో ఉండగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని