Tamil Nadu: నా భార్యను అర్ధనగ్నంగా చేసి 120 మంది దాడి.. డీజీపీకి ఆర్మీజవాన్‌ ఫిర్యాదు

తమిళనాడులో నివాసం ఉంటున్న తన భార్యపై 120 మంది దాడి చేశారని ఓ ఆర్మీ జవాను వాపోయాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఓ వీడియోలో విజ్ఞప్తి చేశాడు. 

Published : 12 Jun 2023 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో ఉన్న తన భార్యపై దాదాపు 120 మంది దాడి చేశారని ఆరోపిస్తూ ఓ జవాను వీడియో రూపంలో రాష్ట్ర పోలీసులు, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోను ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఎన్‌.త్యాగరాజన్‌ ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ప్రభాకరన్‌ ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకరన్‌ చెబుతున్న ఘటన నాగపట్నం జిల్లాలోని కందవాసల్‌లో చోటు చేసుకొంది.

ఈ వీడియోలో ప్రభాకరన్‌ మాట్లాడుతూ ‘‘నా భార్య ఓ స్థలాన్ని లీజుకు తీసుకొని దుకాణం నిర్వహిస్తోంది. ఆమెపై 120 మంది దాడి చేసి కొట్టారు. షాపులో వస్తువులను ధ్వంసం చేశారు. నేను ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఆయన హామీ ఇచ్చారు. డీజీపీ సర్‌, దయ చేసి సాయం చేయండి. వారు కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరిస్తున్నారు. నా భార్యను అర్ధనగ్నంగా చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు’’ అని పేర్కొన్నాడు. 

మరోవైపు కందవాసల్‌ పోలీసుల వాదన దీనికి భిన్నంగా ఉంది. విషయాన్ని సదరు జవాను పెద్దది చేసి చెబున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రభాకరన్‌ చెబుతున్న దుకాణం ఓ దేవాలయానికి చెందిన భూమి. అతడి మామ సెల్వమూర్తి రూ.9.5 లక్షలకు కుమార్‌ అనే వ్యక్తి నుంచి దానిని లీజుకు తీసుకొన్నాడు. ఇందుకోసం కుమార్‌కు నగదు చెల్లించాడు. ఆ తర్వాత కుమార్‌ చనిపోయాడు. అతడి కుమారుడు రాము సదరు దుకాణాన్ని తిరిగి తీసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో నగదు వాపస్‌ ఇచ్చేందుకు రాముతో సెల్వమూర్తికి అంగీకారం కూడా కుదిరింది. కానీ, ఆ తర్వాత సెల్వమూర్తి నగదు వాపస్‌ తీసుకొనేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో జూన్‌ 10న రాము ఆ దుకాణం వద్దకు వెళ్లి సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయ్‌లకు నగదు వాపస్‌ చేశాడు. కానీ, వారు ‘తనపై కత్తితో దాడి చేశార’ని ఆరోపించాడు. చుట్టపక్కల వారు రాముకు మద్దతుగా వచ్చి ఆ షాపుపై దాడి చేశారు. ఆ సమయంలో ప్రభాకరన్‌ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారు. వారిపై దాడి జరగలేదు. అదే రోజు సాయంత్రం కీర్తి ఆసుపత్రిలో చేరింది. దీంతో ప్రభాకరన్‌ ఆమెపై దాడి జరిగిందని చెబుతున్నాడు’ అని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. తమిళనాడు భాజపా చీఫ్‌ కె.అన్నామలై ఆర్మీ జవాన్‌ కుటుంబానికి మద్దతు ప్రకటించారు. సదరు ఆర్మీ జవాను భార్యకు న్యాయం లభించేలా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జవాన్‌ కుటుంబానికి భాజపా అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని