Bharat Ratna: బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

దివంగత బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించారు.

Updated : 23 Jan 2024 22:16 IST

దిల్లీ: బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ (Karpoori Thakur)కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న (Bharat Ratna)తో గౌరవించింది. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్‌.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్‌ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్‌ 1979 వరకు) సీఎంగా సేవలందించి తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా.. 

బ్రిటిష్ ఇండియాలోని బిహార్‌-ఒడిశా ప్రావిన్స్‌లోని  పితౌజియా (ప్రస్తుతం కర్పూరిగ్రామ్‌)లో అతి సామాన్య కుటుంబంలో కర్పూరి ఠాకూర్‌ జన్మించారు. విద్యార్థి దశలోనే పోరాట పంథాను ఎంచుకున్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ తర్వాత జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పుర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి విధాన సభలో అడుగుపెట్టారు. 1960లో పీ అండ్‌ టీ ఉద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించి అరెస్టయ్యారు. ఆ తర్వాత 1970లో టెల్కో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 28 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. బిహార్‌కు మంత్రిగా ఉన్న సమయంలో మెట్రిక్యులేషన్‌లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషిచేశారు.

తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత సైద్ధాంతికంగా ఆయనతో విభేదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేశారు. రామ్‌మనోహర్‌ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగానూ చాలా కాలం పాటు ఠాకూర్‌ పనిచేశారు. దేశంలో భూస్వాముల వద్ద, ప్రభుత్వ ఆధీనంలోని భూముల్ని పేదలకు పంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధిస్తుందని.. తద్వారా దేశం పురోగమిస్తుందని విశ్వసించారు. జనం కోసం  నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు.

ఎందరో ప్రముఖులకు రాజకీయ గురువు..

జయప్రకాశ్‌ నారాయణ్‌కు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్‌ ఆ తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అగ్రకులాలు మాత్రమే రాజకీయ ఆధిపత్యం వహించే బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో అగ్రగణ్యులు. జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ఉద్యమంలోకి రాగా.. అలా వచ్చిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌,  నీతీశ్ కుమార్‌, రాం విలాస్‌ పాశవాన్‌ వంటి నేతలకు ఠాకూర్‌ రాజకీయ గురువు. బిహార్‌లో ఓబీసీలతో పాటు ఎంబీసీలూ ఎదగాలని ఆయన భావించారు. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితం కోసం పనిచేశారు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్‌, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని