దక్కని బెయిల్‌.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ

మహిళ కిడ్నాప్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు.

Published : 09 May 2024 03:08 IST

ఈనాడు, బెంగళూరు: మహిళ కిడ్నాప్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. సిట్‌ ఐదు రోజుల కస్టడీ గడువు ముగియటంతో ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించాలని 17వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ విచారణ గురువారానికి వాయిదా వేయటంతో ఆయనను కారాగారానికి తరలించారు.

ఇక న్యాయపోరాటం..: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో జనతాదళ్‌(ఎస్‌) పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదని.. హెచ్‌.డి.రేవణ్ణ విషయంలో జేడీఎల్పీ నేతగా తాను పోరాటం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి.కుమారస్వామి ప్రకటించారు. రేవణ్ణపై నమోదైన కిడ్నాప్‌ కేసులో వారం రోజులు దాటుతున్నా.. బాధిత మహిళను న్యాయస్థానంలో హాజరుపరచలేదని ఆరోపించారు. పైగా రేవణ్ణకు సంబంధించిన ఫాంహౌస్‌ నుంచి కాకుండా ఆమె బంధువుల ఇంటి నుంచే సిట్‌ అధికారులు అదుపులో తీసుకున్నారని తెలిపారు. ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి వాంగ్మూలాన్ని నమోదు చేయని సిట్‌ అధికారులు.. ప్రభుత్వ ఆదేశానుసారం పని చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ కేసుల్లో బాధిత మహిళలంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్న 12మందిని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆధ్వర్యంలో ఉంచి.. ఆయన సూచన ప్రకారం ఫిర్యాదులు చేయిస్తున్నట్లు కుమారస్వామి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు