ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 100 సర్వీసుల రద్దు

టాటా గ్రూప్‌లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు ఉద్యోగుల సెగ తగిలింది.

Updated : 09 May 2024 06:02 IST

15,000 మంది ప్రయాణికులకు ఇక్కట్లు
సిబ్బంది మూకుమ్మడి అనారోగ్య సెలవుల ఫలితం

దిల్లీ/కోచి: టాటా గ్రూప్‌లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు ఉద్యోగుల సెగ తగిలింది. సీనియర్‌ క్యాబిన్‌ సిబ్బందిలో కొంతమంది మూకుమ్మడిగా అనారోగ్య సెలవు పెట్టడంతో, మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు 100కు పైగా విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసింది. మరికొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో వేర్వేరు విమానాశ్రయాల్లో 15,000 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. కేరళ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అధిక శాతం ఆగిపోవడం, భద్రతా తనిఖీలు చేయించుకున్నాక.. విమాన సర్వీసు రద్దయిందనే సమాచారాన్ని తెలపడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సమయానికి వెళ్లలేకపోతే, తమ ఉద్యోగాలు పోతాయనే ఆందోళన మధ్యప్రాచ్య ప్రయాణికుల్లో నెలకొంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమానాల రద్దుపై సంస్థ నుంచి పౌర విమానయాన శాఖ నివేదిక కోరింది. సమస్యను త్వరగా పరిష్కారించాలనీ ఆదేశించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. మార్చి చివరి వారం నుంచి మొదలైన వేసవి షెడ్యూలు కింద రోజుకు 360 విమాన సర్వీసులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో మే 13 వరకు సర్వీసులను పరిమితంగా నడపాలని సంస్థ నిర్ణయించింది.

కొన్ని రోజులు ఇబ్బందే: సీఈఓ

సిబ్బంది సెలవు కారణంగా కోచి, కాలికట్‌, దిల్లీ, బెంగళూరు వంటి విమానాశ్రయాల్లో దేశీయ, అంతర్జాతీయ సేవలకు అంతరాయం కలిగిందని తెలుస్తోంది.200 మందికి పైగా క్యాబిన్‌ సిబ్బంది అనారోగ్య సెలవు (సిక్‌ లీవ్‌) పెట్టారని కంపెనీ సీఈఓ ఆలోక్‌ సింగ్‌ తెలిపారు.మరికొన్ని రోజులు ఇబ్బందే అన్నారు. 90కి పైగా విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఒక్క దిల్లీలోనే బుధవారం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 14 విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసిందని చెప్పారు.

ఎందుకు ఇలా?: కారణాలు తెలుసుకోడానికి సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. క్యాబిన్‌ సిబ్బందిలోని ఒక వర్గం కొంత కాలంగా అసంతృప్తిగా ఉంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (అంతక్రితం ఎయిరేషియా ఇండియా) విలీన ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 300 మంది క్యాబిన్‌ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఎక్స్‌ఈయూ) ఆరోపించింది.

టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాలోనూ: ఒక నెల క్రితం పైలెట్ల సెలవులతో.. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారా తన రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను 25-30% తగ్గించుకున్న సంగతి తెలిసిందే. విమానయాన వ్యాపార స్థిరీకరణ నిమిత్తం ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని