Smoking in Plane: సిగరెట్‌ కాల్చింది డమ్మీ విమానంలోనట.. బాబీ కటారియా వింత వాదన

బాబీ కటారియా(Bobby Kataria).. తాను సిగరెట్‌ కాల్చింది డమ్మీ విమానంలో అంటూ కొత్త వాదన మొదలుపెట్టాడు.

Published : 12 Aug 2022 14:47 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానంలో బాబీ కటారియా అనే బాడీబిల్డర్‌ దర్జాగా లైటర్‌ వెలిగించి, సిగరెట్‌ కాల్చిన (Cigarette Smoking) ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్‌గా పరిగణించిన పౌర విమానయాన శాఖ ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో స్పందించిన బాబీ కటారియా(Bobby Kataria).. తాను సిగరెట్‌ కాల్చింది డమ్మీ విమానంలో అంటూ కొత్త వాదన మొదలుపెట్టాడు. అయితే, ఈ ఘటనను ఇప్పటికే నిర్ధారించిన సదరు విమానయాన సంస్థ (SpiceJet) మాత్రం.. ఈ ఏడాది జనవరిలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు చెప్పడం గమనార్హం.

‘నేను స్మోకింగ్‌ చేస్తూ చిత్రీకరించిన వీడియో దుబాయ్‌లో డమ్మీ విమానంలో తీసింది. అది కూడా షూటింగ్‌లో భాగంగానే చేశాను. విమానంలోకి లైటర్‌ తీసుకెళ్లడాన్ని అనుమతించరు’ అంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ కటారియా పేర్కొన్నారు. అంతకుముందు కూడా తాను విమానంలో చేసిన ప్రవర్తనను ఆయన సమర్థించుకున్నాడు. తాజాగా ఆ వీడియో మరోసారి వైరల్‌ కావడం, డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బాబీ కటారియా కొత్త వాదన మొదలుపెట్టాడు.

మరోవైపు దీనిపై ఇప్పటికే స్పందించిన స్పైస్‌జెట్‌ సంస్థ.. ‘ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఈ ఘటన జరిగింది. విమానం నంబరు DG706 దుబాయ్‌ నుంచి దిల్లీ వచ్చే విమానంలో ప్రయాణికులు ఉన్న సమయంలోనే ఇది చోటుచేసుకుంది. 21వ వరుసలోని తోటి ప్రయాణికుడి సహాయంతో ఆ వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా జనవరి 24నే మా దృష్టికి వచ్చింది’ అని ప్రకటించింది. ఇందుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి గురుగ్రామ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపింది. చర్యల్లో భాగంగా అతడిపై 15 రోజుల పాటు ప్రయాణ నిషేధాన్ని ఫిబ్రవరిలోనే విధించినట్లు స్పైస్‌జెట్‌ (SpiceJet) స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని