Brazil: కరోనాపై నిర్లక్ష్యం.. దేశాధ్యక్షుడిపై విచారణకు సిఫార్సు

కొవిడ్ కట్టడికి సంబంధించి బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోపై విచారణకు బ్రెజిల్ సెనేట్ కమిటీ సిఫార్సు చేసింది.....

Published : 28 Oct 2021 01:20 IST

బ్రెసీలియా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో నిర్లక్ష్యంతోపాటు తీసుకున్న చర్యలే కారణమంటూ ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొవిడ్ కట్టడిలో బోల్సొనారో నిర్లక్ష్యం వహించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బ్రెజిల్‌ సెనేట్‌ కమిటీ స్పందించింది. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కొద్దిరోజులుగా విచారణ జరిపింది. తాజాగా అధ్యక్షుడిపై విచారణకు కమిటీ సిఫార్సు చేసింది. నిధుల దుర్వినియోగం సహా నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపైనా అధ్యక్షుడిని విచారించాలని ప్రాసిక్యూటర్లకు సిఫార్సు చేసింది.

కరోనా మహమ్మారిని ముందు నుంచీ తక్కువ చేసి చూస్తున్న అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో.. తమకు టీకాలు కూడా అక్కర్లేదని ఆ మధ్య కరాఖండీగా చెప్పేశారు. అయితే, ఆ తర్వాత కాస్త తగ్గారు. దేశ ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ.. ఆయన మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోలేదు. టీకా వేసుకోకుండానే గత నెల అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే టీకా ధ్రువపత్రం లేకుండా అక్కడి రెస్టారెంట్లు ఆయనను లోపలికి రానివ్వలేదు. దీంతో బోల్సెనారో రోడ్డు పక్కనే నిల్చుని పిజ్జా తిన్నారు. టీకా వేసుకోకపోవడంపై బోల్సొనారో తనను తాను సమర్థించుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సరిపడా రోగ నిరోధక శక్తి తనకు ఉందని పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని